North Korea: తన పని తాను చేసుకుపోతున్న ఉత్తర కొరియా... అణుక్షిపణుల కోసం భారీ స్టోరేజి నిర్మాణం!

  • సిల్-లి ప్రాంతంలో భారీ కదలికలు
  • పసిగట్టిన నిఘా ఉపగ్రహాలు
  • అత్యంత శక్తిమంతమైన క్షిపణుల నిల్వ కేంద్రంగా గుర్తింపు!
North Korea builds large nuclear missile storage

ఉత్తర కొరియా మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవల ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కనిపించడం లేదంటూ కొన్నిరోజుల పాటు చర్చ నడవగా, ఓ ఫర్టిలైజర్స్ కంపెనీ ప్రారంభోత్సవంలో కిమ్ కనిపించేసరికి ఆ చర్చకు తాత్కాలికంగా తెరపడింది. తాజాగా, ఉత్తర కొరియాపై నిఘా వేసిన ఉపగ్రహాలు అత్యంత ఆసక్తికరమైన ఫుటేజి సేకరించాయి. తక్కిన ప్రపంచం కరోనాతో సతమతమవుతుంటే, రాజధాని ప్యాంగ్ యాంగ్ సమీపంలోని సిల్-లి ప్రాంతంలో కొన్ని భారీ కట్టడాలు నిర్మాణం జరుపుకుంటున్నట్టు నిపుణులు గుర్తించారు.

అణుక్షిపణుల కర్మాగారంతో అనుసంధానిస్తూ ఓ రైల్వే లైను, మూడు భారీ హ్యాంగర్లు, ఓ భారీ భూగర్భ స్టోరేజి వసతి శాటిలైట్ చిత్రాల్లో కనిపించాయి. ఇక్కడ అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణుల అసెంబ్లింగ్, నిల్వ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నిపుణులు విశ్లేషించారు. జరుగుతున్న పనులు ఈ ఏడాది చివరినాటికి గానీ, 2021 ప్రథమార్థంలో గానీ పూర్తవ్వొచ్చని తెలిపారు. అంతేకాదు, ఈ భారీ స్టోరేజి నిర్మాణానికి 17 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, పెద్ద సంఖ్యలో భూతల రక్షణ కేంద్రాలు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలతో రక్షణ కల్పిస్తున్నారని వివరించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు విఫలమైన తర్వాత ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ మళ్లీ అణ్వస్త్రాల పెంపుపై దృష్టి సారించినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.

More Telugu News