RTA: నేటి నుంచి తెలంగాణలో ఆర్టీఏ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

  • ఆర్టీఏ ఆన్ లైన్ సేవలు కూడా అందుబాటులోకి
  • రద్దీని తగ్గించే నిమిత్తం స్లాట్ ల సంఖ్య 50కు పరిమితం
  • మార్చి 23న స్లాట్ లు బుక్ చేసుకున్నవారికి దశలవారీగా సేవలు 

నేటి నుంచి తెలంగాణలో  రోడ్డు ట్రాన్స్ పోర్టు అథారిటి (ఆర్టీఏ) రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆర్టీఏ ఆన్ లైన్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్సులు, డూప్లికేట్ డాక్యుమెంట్స్ తదితర సేవల నిమిత్తం ఆన్ లైన్ లో స్లాట్ లను బుక్ చేసుకుని వినియోగదారులు ఫీజులు చెల్లించు కోవచ్చు. అయితే, ‘కరోనా’ నియంత్రణా చర్యల్లో భాగంగా ఆర్టీఏ కార్యాలయాలకు రద్దీని తగ్గించే నిమిత్తం స్లాట్ ల సంఖ్యను 50కు పరిమితం చేశారు.

మార్చి 23న స్లాట్ లు నమోదు చేసుకుని ఫీజు చెల్లించినవారికి దశలవారీగా సేవలను అందజేస్తామని అధికారులు తెలిపారు. లెర్నింగ్ లైసెన్స్ కాలపరిమితి ముగిసినా లాక్ డౌన్ కారణంగా పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయినవారికి కూడా లెర్నింగ్ లైసెన్స్ ల గడువును పొడిగించినట్టు తెలిపారు.

ఇక దరఖాస్తుదారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాలకు రావాలని, మాస్క్ లేకుండా వస్తే వాహనాల రిజిస్ట్రేషన్లు సహా ఎలాంటి సేవలు అందించమని స్పష్టం చేశారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ మాత్రం సహాయకులను తమ వెంట తెచ్చుకోవచ్చని అన్నారు. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే ప్రతి వ్యక్తినీ థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. కార్యాలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

More Telugu News