Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు 'రంగుల'పై కొత్త జీవోను నిలిపివేసిన హైకోర్టు!

AP High court suspends  GO 623 relating to colours of Panchayat Offices
  • పంచాయతీలకు పార్టీ రంగులపై ప్రభుత్వానికి షాక్
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • హైకోర్టులో పిల్ వేసిన న్యాయవాది సోమయాజి
వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 623ని హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

కార్యాలయాల రంగులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా కొత్తగా 623 జీవోను విడుదల చేశారంటూ న్యాయవాది సోమయాజి పిల్ దాఖలు చేశారు. పాత జీవోలో ఉన్న అంశాలే ఈ జీవోలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ రంగులన్నీ అలాగే ఉంచి, కొత్తగా మట్టి రంగును చేరుస్తూ కొత్త జీవో జారీ చేశారని తెలిపారు. దీంతో, కొత్త జీవోను హైకోర్టు నిలిపివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కార్యాలయాలపై పార్టీ రంగులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలోనే హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో, పార్టీకి సంబంధించిన మూడు రంగులకు మరో రంగు (మట్టి రంగు)ను చేర్చుతూ ప్రభుత్వం కొత్త జీవోను ఇటీవల జారీ చేసింది. దీంతో, ఈ జీవోపై కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై నేడు విచారణ జరిపిన హైకోర్టు కొత్త జీవోను నిలిపివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
Andhra Pradesh
Panchayat Offices
YSRCP Colours
AP High Court

More Telugu News