Monkey: ఆడుకుంటున్న బాలుడిని ఈడ్చుకెళ్లిన కోతి... వీడియో ఇదిగో!

Monkey Kidnap Attempt goes Viral
  • ఇండోనేషియాలోని సురబయాలో ఘటన
  • కోతులు ఆడించే వ్యక్తి నుంచి తప్పించుకున్న కోతి
  • బాలుడిని లాక్కెళ్లే ప్రయత్నం, స్వల్ప గాయాలు
ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకుని వెళ్లేందుకు ఓ కోతి విశ్వ ప్రయత్నం చేసిన వింతైన ఘటన ఇండోనేషియాలో జరుగగా, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ ఘటనను వీడియో తీసిన జసా సుపాంజీ వెల్లడించిన వివరాల్లోకి వెళితే, సురబయా ప్రాంతంలోని ఓ ఇరుకు వీధిలో బాలుడు తోటి బాలలతో ఆడుకుంటూ సైకిల్ తొక్కుతున్నాడు. ఆ వీధిలో చాలా మంది పెద్దలు కూర్చుని ఉన్నారు కూడా. ఇంతలో ఓ కోతి పరుగున బాలుడి వద్దకు వచ్చి, అతన్ని లాగింది. ఆపై చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్లింది. భయపడిన ఆ బాలుడు కేకలు పెడుతున్నా కోతి ఆగలేదు.

పిల్లల ఆటలను వీడియో తీస్తున్న జసా స్మార్ట్ ఫోన్ లో ఈ ఘటనకు చెందిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. బాలుడిని కోతి లాక్కెళుతుంటే, వీడియో తీస్తున్న జసా కింద ఉన్న వారిని అలర్ట్ చేశాడు. దీంతో కొందరు కోతి వెంట పడగా, అది బాలుడిని వదిలేసి పారిపోయింది. ఈ ఘటనలో బాలుడి శరీరంపై స్వల్ప గాయాలు అయ్యాయి.

కాగా, ఈ కోతి, కోతులను ఆడిస్తున్న ఓ వ్యక్తికి చెందినదని తెలుస్తోంది. నాలుగు వీధుల కూడలిలో కోతులకు లాగు, చొక్కాలు వేసి, వాటితో ఆటలాడించే సంస్కృతి పలు దేశాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. కోతులకు మనుషుల్లా ప్రవర్తించేలా శిక్షణ ఇచ్చి, వాటితో బలవంతంగా గంతులు వేయిస్తూ ఎంతో మంది పొట్టపోసుకుంటారు. ఇక ఈ ఘటన తరువాత, సదరు కోతిని దాని యజమాని బాగా కొట్టి, ఓ చిన్న డబ్బాలో పెట్టాడని జసా సుపాంజీ తెలిపాడు. 
Monkey
Surabaya
Kidnap
Viral Videos

More Telugu News