Test Match: టీమిండియా ర్యాంకును దిగజార్చిన ఐసీసీ పాయింట్ల సిస్టంపై మండిపడ్డ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం!

  • పాయింట్ల సిస్టం హాస్యాస్పదంగా ఉంది
  • 5 మ్యాచులు గెలిచి సాధించే పాయింట్లను 2 మ్యాచులు గెలిచి సాధించవచ్చు
  • టెస్టు మ్యాచులను ఈ పాయింట్ల సిస్టం దెబ్బతీస్తుంది 
Michael Holding Calls World Test Championships Points System Ridiculous

ఐసీసీ టెస్టు క్రికెట్ పాయింట్ల సిస్టం హాస్యాస్పదంగా ఉందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం మైఖేల్ హల్డింగ్స్ విమర్శించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిస్తే 60 పాయింట్లు వస్తాయి. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిస్తే 24 పాయింట్లు వస్తాయి. ఈ నేపథ్యంలో 2 టెస్టుల సిరీస్ లో అన్ని మ్యాచులు గెలిచినా, 5 టెస్టుల సిరీస్ లో అన్ని మ్యాచులు గెలిచినా 120 పాయింట్లే వస్తాయి. పాయింట్ల పట్టికలో టాప్ టూ పొజిషన్లలో నిలిచిన జట్లు 2021 జూన్ లో లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. ఆ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టును టెస్టు ఛాంపియన్ షిప్ వరిస్తుంది. ఈ నిబంధనలపై మైఖేల్ హోల్డింగ్ విమర్శలు గుప్పించారు.

పాయింట్ల సిస్టమే బాగోలేదని... ఐదు మ్యాచులు గెలిచి సాధించే పాయింట్లను కేవలం రెండు మ్యాచులు గెలిచి సాధించవచ్చని హోల్డింగ్స్ అసహనం వ్యక్తం చేశారు. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు వెళ్లలేవని తేలిపోయిన జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచులకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చని... దీన్నొక సాధారణ మ్యాచ్ గానే వారు చూసే అవకాశం ఉందని... ఇది రెండో డ్రాబ్యాక్ అని చెప్పారు. టెస్టు మ్యాచులను ఈ పాయింట్ల సిస్టం దెబ్బతీస్తుందని తెలిపారు.

ఈ పాయింట్ల విధానం వల్ల టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఇండియా... మూడో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఇక మ్యాచులు జరిగే అవకాశం లేకపోవడంతో... ఐసీసీ నిబంధలన ప్రకారం భారత్ పాయింట్ల పట్టికలో కిందకు జారిపోయింది.

More Telugu News