Javed Miandad: భారత స్పిన్నర్లా... వాళ్లను మేం ఉతికారేశాం: మియాందాద్

  • 1978 సిరీస్ గురించి వివరించిన మియాందాద్
  • జహీర్ అబ్బాస్ తో కలిసి పరుగులు వెల్లువెత్తించానని వెల్లడి
  • 0-2తో భారత్ ఓటమి
Miandad recollects India Pakistan encounters

పాకిస్థాన్ క్రికెట్ లో ప్రతిభకు ఎప్పుడూ లోటులేదు. అయితే వ్యవస్థాపరమైన లోపాలు ఆ జట్టుకు శాపంగా మారాయి. దానికితోడు ఆటగాళ్ల నిలకడలేమి, వివాదాలు పాక్ జట్టును ఓ సాధారణ జట్టుగా మార్చాయి. ఇమ్రాన్ ఖాన్ హయాంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జట్టు, ఇప్పుడు... ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టుగా తయారైంది. ఇక, 1978-79 సీజన్ లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టు సిరీస్ లో పరాజయం చవిచూసింది. మూడు టెస్టుల సిరీస్ ను 0-2తో కోల్పోయింది. దీనిపై పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందాద్ తనదైన శైలిలో స్పందించాడు.

ఆ సిరీస్ నాటికి భారత స్పిన్నర్ల త్రయం బిషన్ సింగ్ బేడీ, చంద్రశేఖర్, ఎరాపల్లి ప్రసన్న అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై మెరుగైన రికార్డు కలిగివున్నారని మియాందాద్ చెప్పాడు. అయితే, తమపై వారి పప్పులు ఉడకలేదని, దిగ్గజ బ్యాట్స్ మన్ జహీర్ అబ్బాస్, తాను కలిసి భారత స్పిన్ త్రయాన్ని ఉతికారేశామని అన్నాడు. అప్పటికి తాను అంతర్జాతీయ క్రికెట్ కు కొత్త అయినా, ఆ సిరీస్ లో మాత్రం పరుగుల వరద పారించానని, భారత స్పిన్నర్ల బౌలింగ్ లో పరుగులు పిండుకున్నామని వివరించాడు.

"చంద్రశేఖర్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో జహీర్ కొంచెం ఇబ్బందిపడ్డాడు. దాంతో "జావేద్, అతడి సంగతి చూడు" అంటూ నాకు పురమాయించాడు. మరో ఎండ్ లో బేడీ, ప్రసన్న బౌలింగ్ లో జహీర్ బాగా పరుగులు రాబడుతుండడంతో నాక్కూడా కొన్ని పరుగులు సాధించే అవకాశం ఇవ్వమని అతడ్ని అడిగాను. జహీర్ కు ఇబ్బంది ఎదురైనప్పుడు నేను, నాకు ఇబ్బంది ఎదురైనప్పుడు జహీర్... పరస్పరం అండగా నిలబడి  భారత స్పిన్ దాడులను తుత్తునియలు చేశాం" అని మియాందాద్ వివరించాడు.

More Telugu News