Andhra Pradesh: ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని మద్యం దుకాణాల వద్ద ఉద్రిక్తత!

  • ఏపీలో ఈరోజు నుంచి ప్రారంభమైన మద్యం అమ్మకాలు 
  • మద్యం కోసం వస్తున్న సరిహద్దు రాష్ట్ర వాసులు
  • నెల్లూరు జిల్లాలోని జీవీపాలెం, రామాపురంలో ఉద్రిక్తత
Liquor stores raging across AP Tamil Nadu border

ఏపీలో ఈరోజు నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ప్రస్తుతం మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో అక్కడి మందుబాబులు ఇక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జీవీపాలెం, రామాపురంలోని మద్యం దుకాణాల వద్దకు  తమిళనాడు వాసులు వస్తుండటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జీవీపాలెం, రామాపురంలోని 7 మద్యం దుకాణాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. మద్యం షాపులను మూసివేయించి తమిళనాడు వాసులను వెనక్కి పంపిస్తున్నారు.
 
చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంలోనూ మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు నుంచి మందుబాబులు పాలసముద్రంలోని మద్యం దుకాణాల వద్దకు రావడంతో అమ్మకాలు నిలిచిపోయినట్టు సమాచారం.

 గ్రీన్ జోన్లలోని మద్యం దుకాణాలకు వస్తున్న రెడ్ జోన్లలోని మందుబాబులు
 
గుంటూరు జిల్లాలోని మాచవరం, పిల్లుట్లలోని మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఇతర గ్రామాల వారు తమ గ్రామంలోని మద్యం దుకాణాల వద్దకు రావడంపై పిల్లుట్ల గ్రామస్తులు ధర్నాకు దిగారు. రెడ్ జోన్ల లో ఉన్న వారు గ్రీన్ జోన్లలోకి మద్యం కొనుగోలు నిమిత్తం రావడాన్ని వారు నిరసిస్తూ ఈ ధర్నాకు దిగారు.

More Telugu News