Zoom App: డార్క్ వెబ్ లో అమ్మకానికి 5 లక్షల మంది 'జూమ్' యూజర్ల లాగిన్ వివరాలు

  • లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజాదరణ పొందిన జూమ్ యాప్
  • వీడియో కాలింగ్ కోసం జూమ్ ను ఆశ్రయిస్తున్న ప్రజలు
  • జూమ్ పై కన్నేసిన హ్యాకర్లు
Zoom app user details up for sale in dark net

లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇలా వేర్వేరు ప్రాంతాల నుంచి పనిచేసే ఉద్యోగుల మధ్య సమన్వయం కోసం, బిజినెస్ సమావేశాల కోసం జూమ్ వీడియో కాలింగ్ యాప్ ను వినియోగించడం బాగా ఎక్కువైంది. అయితే జూమ్ యాప్ భద్రతపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూజర్ల సమాచారంపై ఈ యాప్ లో భరోసా తక్కువ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తాజాగా, జూమ్ యాప్ భద్రతపై దిగ్భ్రాంతి కలిగించే విషయం వెల్లడైంది. డార్క్ వెబ్ లో దాదాపు 5 లక్షల మంది జూమ్ యూజర్ల లాగిన్ వివరాలు అమ్మకానికి వచ్చాయని ఓ కథనం వెల్లడించింది. వీటిలో ఒక్కో యూజర్ కు సంబంధించిన సమాచారం కేవలం ఒక్క రూపాయి కంటే తక్కువ ధరకే లభ్యమవుతోందని ఆ కథనంలో పేర్కొన్నారు. దీనిపై జూమ్ వర్గాలు స్పందించాయి. ఈ విషయంపై తాము కూడా ఓ కన్నేసి ఉంచామని, పాస్ వర్డ్ లు తస్కరించి వ్యక్తిగత సమాచారం సేకరించే వారి పనిబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నాయి.

ఇప్పటికే పాస్ వర్డ్ లు మార్చుకోవాలంటూ యూజర్లకు సూచించామని, మరిన్ని భద్రతాపరమైన ఏర్పాట్ల కోసం ప్రయత్నిస్తున్నామని జూమ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంటర్నెట్లో ఒకచోట ఉపయోగించిన వివరాలనే మరోచోట ఉపయోగించడం వెబ్ సేవలకు సంబంధించి సాధారణ విషయమేనని, హ్యాకర్లు ఇలాంటి వాటినే టార్గెట్ చేస్తుంటారని జూమ్ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు.

More Telugu News