Cheetha: కుక్కలకు భయపడి, చెట్టెక్కి కూర్చున్న చిరుతపులి!

  • కామారెడ్డి జిల్లా నందివాడ సమీపంలో ఘటన
  • అడవిలోకి వెళ్లిన గొర్రెల కాపరులపై దాడికి చిరుత ప్రయత్నం
  • కుక్కుల దాడితో బెంబేలెత్తిన చిరుతపులి
Dogs Feared Cheetha

శునకాలను గ్రామ సింహాలని అనేందుకు ఇది మరో చక్కని ఉదాహరణని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తమను నమ్మినవారిని కాపాడే శునకాలు, ఓ చిరుతపులిని బెంబేలెత్తించిన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట సమీపంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, నందివాడ శివారు ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. నిన్న గొర్రెల కాపరులు కొందరు అక్కడికి వెళ్లగా, ఓ చిరుతపులి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే, తమ గొర్రెలకు కాపలాగా వారు పెంచుకుంటున్న వేట కుక్కలు, చిరుతను గమనించి, వెంటనే దానిపైకి లంఘించాయి.

దాదాపు ఎనిమిది కుక్కలు ఒకేసారి మీదకు రావడంతో చిరుతపులి ప్రాణభయంతో వణికిపోయింది. పక్కనే కనిపించిన చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. కాసేపు చెట్టు కిందనే వేచి చూసిన కుక్కలు, అక్కడి నుంచి వెళ్లిపోగా, చిరుతపులి ఆపై కిందకు దిగి, బతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి రేంజ్‌ అధికారి చంద్రకాంత్‌రెడ్డి బేస్‌ క్యాంపు సిబ్బందితో కలసి ఘటనా స్థలిని సందర్శించారు. ఈ ప్రాంతాల వాసులు, ముఖ్యంగా పశువుల కాపరులు, తునికాకు సేకరించే మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

More Telugu News