Chennai: చెన్నై కోయంబేడు మార్కెట్లో 119 మందికి కరోనా... ఏపీ జిల్లాలకు నిలిచిపోయిన కూరగాయల రవాణా!

  • తమిళనాడులో కరోనా విజృంభణ
  • చెన్నై సహా పలు జిల్లాల కూలీలకు కరోనా పాజిటివ్
  • మూడ్రోజులుగా నెల్లూరు జిల్లాకు నిలిచిపోయిన కూరగాయల రవాణా
Koyambedu Market witnesses corona positive cases

తమిళనాడులో కరోనా రక్కసి ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,526కి చేరింది. మరణాల సంఖ్య 28గా నమోదైంది. అయితే, చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో 119 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

చెన్నైకి చెందినవారికే కాకుండా పలు జిల్లాల కూలీలకు వైరస్ సోకినట్టు గుర్తించారు. గత కొన్నిరోజులుగా కోయంబేడు మార్కెట్ నుంచి ఏపీలోని పలు జిల్లాలకు కూరగాయలు సరఫరా అయినట్టు తెలుస్తోంది. ఈ మార్కెట్ నుంచి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు కూరగాయలు రవాణా చేశారు.

ఈ నేపథ్యంలో మూడు రోజులుగా చెన్నై నుంచి నెల్లూరు జిల్లాకు కూరగాయల రవాణా నిలిచిపోయింది. సాధారణంగా ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు రోజుకు 100 టన్నుల కూరగాయలు రవాణా అవుతాయి. వైరస్ ఉనికి కారణంగా చెన్నై నుంచి వచ్చేవారిపై నిఘా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

More Telugu News