Telangana: లిక్కర్ షాపులపై కింకర్తవ్యం... నేడు తేల్చనున్న కేసీఆర్!

Telangana Will Decide Today on Liquor Shops Reopening
  • తెలంగాణలో 7 వరకూ లాక్ డౌన్
  • రేపటి నుంచి మద్యం దుకాణాలు తెరచేందుకు అనుమతి
  • పలువురి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్
మద్యం విధానంపై కేంద్రం సూచించిన విధంగా సోమవారం నుంచి షాపులను తెరచుకునేందుకు అనుమతించాలా? వద్దా? అన్న విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ 2.0 నేటితో ముగియనుండగా, తెలంగాణలో మాత్రం 7వ తారీఖు వరకూ అమలులో ఉండనుందన్న సంగతి తెలిసిందే. ఈలోగా, లాక్ డౌన్ మూడో విడతను ప్రకటించిన కేంద్రం, మరో రెండు వారాలు నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూనే, వైన్స్ షాపులను ఓపెన్ చేసేందుకు అంగీకరించింది. ఇంతవరకూ నిత్యావసరాల డెలివరీకి మాత్రమే అనుమతి ఉన్న ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులను డెలివరీ చేసేందుకు కూడా అనుమతులు లభించాయి.

ఇక నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసిన కేసీఆర్, లాక్ డౌన్ సడలింపులు, తదుపరి పర్యవసానాలపై చర్చించారు. నేడు మరికొందరి మనోగతాలను తెలుసుకుని, ఆపై నిఘా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి, మద్యం షాపులపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెలువరిస్తారని తెలుస్తోంది. కాగా, తెలంగాణలో నమోదవుతున్న కొత్త కేసులు, మరణాలు తదితరాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో కేసీఆర్ మాట్లాడారు. 
Telangana
Liquor
Shops
KCR
Review
Corona Virus
Lockdown

More Telugu News