Sutapa: ఇర్ఫాన్ ఖాన్ మృతిపై భార్య సుతాపా భావోద్వేగ స్పందన

Irfan Khan wife Sutapa released a note on his husband demise
  • క్యాన్సర్ తో మృతి చెందిన నటుడు ఇర్ఫాన్ ఖాన్
  • తమకు యావత్ ప్రపంచం అండగా నిలిచిందన్న భార్య సుతాపా
  • ప్రతి ఒక్కరూ తమతో కలిసి రోదించారని వెల్లడి
అభిమాన సంద్రాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన నుంచి ఆయన కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా తీవ్ర భావోద్వేగాలతో స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించారు.

"మాతో పాటు యావత్ ప్రపంచం రోదిస్తుంటే ఇది కేవలం కుటుంబ ప్రకటన మాత్రమే అని ఎలా చెప్పగలను? ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను, ఇది మాకు నష్టం కాదు, లాభం. ఇర్ఫాన్ మృతి పట్ల ఎంతో మంది మాతో కలిసి బాధపడుతున్నారు. ఇర్ఫాన్ మాటల్లో చెప్పాలంటే ఇదంతా ఓ మ్యాజిక్ లా ఉంది. ఇర్ఫాన్ ఎప్పుడూ దేన్నీ దాని స్థాయి, లక్షణం ఆధారంగా ప్రేమించలేదు.

ఒక్క విషయంలో మాత్రం నాకు అన్యాయం చేశాడు. పర్ఫెక్షన్ కోసం పరితపించే అతని కోసం నేను ఏ విషయాన్ని సాధారణంగా పరిగణించే వీల్లేకుండా పోయింది. ప్రతి అంశంలోనూ ఓ లయను గుర్తించేవాడు. ఇర్ఫాన్ కు క్యాన్సర్ సోకినప్పటి నుంచి గడిచిన రెండు, రెండున్నరేళ్ల కాలాన్ని మేం బాధాతప్త సమయంగా భావించడంలేదు. ఇదో తియ్యటి వేదనాభరితమైన కాలంగానే భావించాం. ఎంతోమంది సహృదయులైన వైద్యులు మాతో కలిసి పయనించారు.

35 ఏళ్ల మా సాహచర్యం అటుంచితే, జీవితం ప్రతి అంశంలో ఇర్ఫాన్ ఓ సంగీతకారుడిలా బాణీలు కూర్చాడు. మాది పెళ్లి అని చెప్పుకోం, అదో కలయిక. ఓ పడవలో నేను, ఇర్ఫాన్, మా పిల్లలు అయాన్, బాబిల్ వెళుతుంటే.... ఇటు కాదు ఇటు, ఇటు కాదు అటు అంటూ ఇర్ఫాన్ సూచనలు చేస్తుండేవాడు. అయినా జీవితం సినిమా కాదు కదా. ఇక్కడ రీటేక్స్ అనేవి వుండవు.. అందుకే, ఇకపై ఇర్ఫాన్ లేకపోయినా, అతను చూపించిన దారిలో మా పిల్లలు తమ పడవ ప్రయాణాన్ని తుపానులో సైతం సవ్యమైన రీతిలో సాగించాలని కోరుకుంటున్నాను" అంటూ సుతాపా పేర్కొన్నారు.
Sutapa
Irfan Khan
Demise
Death
Note
Bollywood
India

More Telugu News