Supreme Court: సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిలిపివేతకు సుప్రీం నిరాకరణ

  • కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక  ప్రాజెక్టుకు మార్గం సుగమం
  • భూ వినియోగంలో మార్పులను సవాల్‌ చేస్తూ వచ్చిన పిటిషన్లపై విచారణ
  • 20 వేల కోట్ల వ్యయంతో నూతన పార్లమెంట్‌, ఇతర భవనాల నిర్మాణం
Supreme Court refuses to put a hold on Delhi Central Vista project

నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు 20 వేల కోట్లతో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్’ ను నిలిపివేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  ఈ ప్రాజెక్ట్ కోసం భూ వినియోగ చట్టంలో మార్పు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్  చేస్తూ దాఖలైన  పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ  ప్రాజెక్ట్ పై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని గురువారం తేల్చి చెప్పింది.  దీంతో ఈ  భారీ ప్రాజెక్ట్ కు మార్గం సుగమమైంది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా కొత్త పార్లమెంట్ సహా పలు భవనాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీ అభివృద్ధి మండలి (డీడీఏ) సిఫారసుల మేరకు ఈ ప్రాజెక్టుకు ఉపయోగించే భూ వినియోగంలో మార్పులు చేసింది. ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలో హరిత ప్రదేశాలు, పబ్లిక్‌-సెమీ-పబ్లిక్‌ ప్రదేశాలు మరింత మెరుగుపడతాయి.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో రాష్ట్రపతి భవన్, పార్లమెంట్‌ సముదాయం, నార్త్- సౌత్‌ బ్లాక్‌, ఇండియా గేట్‌, నేషనల్‌ ఆర్కైవ్స్‌ భవనాలు ఉన్నాయి. ఇవన్నీ కొత్త రాజధానిలో భాగంగా 1931కి ముందు నిర్మించినవే. కాగా, ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలు కూడా నిర్మించనున్నారు. కాగా,  ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గటంతో ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేయాలని ఇటీవల ప్రధానికి రాసిన లేఖలో సోనియా కోరారు. ప్రాజెక్ట్ కు చేసే ఖర్చును ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించేందుకు వినియోగించాలని సూచించారు.

More Telugu News