rhesus monkeys: కోతుల్లో పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్.. చిగురిస్తున్న ఆశలు!

  • ప్రయోగాలకు ఆసియా కోతులను ఎంచుకున్న ఆక్స్ ఫర్డ్
  • టీకా వేసిన తరువాత కరోనాను నిలువరించిన మర్కటాలు
  • మానవులపై ప్రయోగం విజయవంతమైతే వెంటనే టీకా
World Hope on Rhesus Monkeys

ఇక్కడ కనిపిస్తున్న కోతులను చూశారా? సాధారణంగా ఇండియాలో ప్రతి ఊరిలో కనిపించే కోతులే ఇవి. ఇవి ఆసియాలోనే అధికంగా కనిపిస్తాయి. వీటిని రీసెస్ జాతిగా పిలుస్తుంటారు. ఇప్పుడీ రకానికి చెందిన ఆరు కోతులు మొత్తం మానవాళికి ఆశలు రేపుతున్నాయి. కరోనా టీకాను తయారు చేస్తున్న ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ వైద్యులు తమ టీకాను ఆరు ఇదే తరహా కోతులపై ప్రయోగించగా, తమ శరీరంలోకి ప్రవేశించిన వైరస్ ను ఇవి నిలువరించాయి.

ఈ ప్రయోగం యూఎస్ లోని మాన్టానలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రయోగశాలలో జరిగిందని 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది. ఈ కోతుల జన్యు క్రమానికి, మానవుల జన్యు క్రమానికి 93 శాతం వరకూ పోలికలు ఉండటంతో, ఇప్పుడు ఇదే టీకాను మానవులపై ప్రయోగిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ టీకా నమ్మకమైన ఫలితాన్ని ఇస్తుందని అంచనా వేవస్తున్నారు.

కాగా, రీసెస్ జాతి కోతులపై ప్రయోగాలు మార్చిలోనే ప్రారంభమయ్యాయి. మొత్తం 12 ఆరోగ్యవంతమైన కోతులను ఎంపిక చేసుకున్న శాస్త్రవేత్తలు, వాటిని రెండు జట్లుగా విభజించి, వేర్వేరుగా ఉంచారు. ఆరు కోతులకు కరోనా వైరస్ సోకేలా చేశారు. మరో ఆరు కోతులకు టీకాను ఇచ్చిన తరువాత కరోనా వైరస్ సోకేలా చేశారు. టీకా ఇవ్వని కోతులు తీవ్ర అనారోగ్యం బారిన పడగా, టీకా తీసుకున్న కోతుల్లో 28 రోజుల తరువాత కూడా ఎలాంటి అనారోగ్య లక్షణాలూ కనిపించలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవులపై జరుగుతున్న ప్రయోగాల్లో ఈ టీకాను తీసుకున్న తరువాత వారు కరోనా బారిన పడకుండా ఉంటేనే విజయం సాధించినట్లని తెలియజేశారు.

కాగా, ఆక్స్ ఫర్ట్ నిర్వహిస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే, ఆ వెంటనే వాక్సిన్ తయారీకి ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సిద్ధంగా ఉంది. శాస్త్రవేత్తలు విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందని, అందుకే టీకా ప్రయోగాలు ముగిసేలోగానే, సాధ్యమైనంత సమయాన్ని ఆదా చేసేందుకు ప్రొడక్షన్ ను ప్రారంభిస్తున్నామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధర్ పూనావాలా వెల్లడించారు.

More Telugu News