Sanjay Rampal: అమ్మను చూసేందుకు.. సైకిల్ పై ముంబయి నుంచి హరియాణాకు!

  • సినిమాల్లో అవకాశాల కోసం 3 నెలల క్రితం ముంబయికి  
  • తల్లి వద్దకు వెళ్లాలనుకుంటే లాక్ డౌన్ 
  • 16 రోజుల పాటు సైకిల్ తొక్కి గమ్యస్థానం చేరిన వైనం 
A Youth adventure to meet his mother

లాక్ డౌన్ తో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. తమ గ్రామాలకు లేదా టౌన్లకు సమీపంలో నివసించే వారైతే ఏదో విధంగా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమ స్వస్థలానికి చాలా దూర ప్రాంతాల్లో నివసించే వారు మాత్రం అక్కడే ఉండి పోయే పరిస్థితి.


అయితే, ఒంటరిగా ఉన్న తన తల్లి కోసం ఓ యువనటుడు మహారాష్ట్రలోని ముంబయి నుంచి సైకిల్ తొక్కుకుంటూ హర్యానాకు వెళ్లాడు. వివరాల్లోకి వెళితే, సంజయ్ రాంపాల్, హర్యానాలోని చార్కి దాద్రి జిల్లా వాసి. సినిమాల్లో అవకాశాల నిమిత్తం మూడు నెలల క్రితం ముంబయి వెళ్లాడు. తొలి విడత లాక్ డౌన్ విధించడంతో ముంబయిలోనే ఉండిపోయాడు.

అయితే, హర్యానాలో ఒంటరిగా ఉన్న తన తల్లి వద్దకు వెళ్లాలనుకున్నా వెళ్లలేని పరిస్థితి. తొలి విడత లాక్ డౌన్ ఎత్తివేశాక హర్యానా వెళ్లాలన్న ఉద్దేశంతో టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ, లాక్ డౌన్ పొడిగించడంతో ఆ టికెట్లు రద్దయ్యాయి.

ఇక ఎలాగైనా సరే, తన తల్లి వద్దకు వెళ్లాలనుకున్న సంజయ్, ఓఎల్ ఎక్స్ లో ఓ సైకిల్ కొనుగోలు చేశాడు. ఆ సైకిల్ పై ముంబయి నుంచి హర్యానాకు ప్రయాణమయ్యాడు. పదహారు రోజుల ప్రయాణం అనంతరం నిన్న తన తల్లి వద్దకు సంజయ్ చేరుకున్నాడు.

దాదాపు 1,281 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ తన గమ్యస్థానం చేరాడు. ఒంటరిగా జీవిస్తున్న తన తల్లి ఎలా ఉందోనని కంగారు పడ్డానని, అందుకే, సైకిల్ పై వెళ్లాలని నిశ్చయించుకుని బయలుదేరానని సంజయ్ రాంపాల్ చెప్పాడు.

More Telugu News