Haryana: పోలీసులు, వైద్యులపై స్థానికుల రాళ్ల దాడి.. అంబులెన్స్‌ ధ్వంసం.. గాల్లోకి పోలీసుల కాల్పులు

  • హర్యానాలో ఘటన
  • కరోనా అనుమానిత మహిళ ఖననం సమయంలో స్థానికులు అడ్డంకులు
  • స్థానికులపై కేసులు నమోదు చేసిన పోలీసులు
rukus in haryana

కరోనా వైరస్‌ విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి పని చేస్తోన్న పోలీసులపై దాడులు జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. కరోనా అనుమానిత మహిళ మృతదేహాన్ని దహనం చేస్తున్నారనే పుకార్లు వ్యాపించడంతో హరియాణాలోని అంబాలాలో అలజడి రేగింది.

ఓ మహిళ (60) కరోనాకు చికిత్స అందించే ఓ ఆసుపత్రిలోనే అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతదేహాన్ని దహనం చేసేందుకు వైద్యులు, పోలీసులు కూడా శ్మశాన వాటికకు వచ్చారు.

దీంతో స్థానికులు గుంపుగా దూసుకొచ్చి పోలీసులు, వైద్యులపై రాళ్లతో దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో ఒక అంబులెన్స్‌ కూడా ధ్వంసమైంది.  దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం స్థానికులు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ మహిళ  ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని, అయితే, ఆమెకు సంబంధించి కరోనా‌ నిర్ధారణ రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు చెప్పారు.

కరోనా వైరస్‌ అనుమానితులుగా చనిపోయినప్పటికీ మృతదేహాన్ని దహనం చేసేందుకు పూర్తి పద్ధతులు పాటిస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించి రోడ్లపైకి రావడమే కాకుండా, పోలీసులు, వైద్యుల విధులను అడ్డుకోవాలని యత్నించిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News