Fact Check: సోషల్ మీడియా ఫేక్ న్యూస్ నిగ్గు తేల్చిన తెలంగాణ 'ఫ్యాక్ట్ చెక్'!

  • కరోనాపై సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో ఫేక్ న్యూస్
  • ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • అసలు వాస్తవాలను వెల్లడించిన 'ఫ్యాక్ట్ చెక్'
Telangana government portla Fact Check tells what is truth and what is fake news

ఎక్కడ, ఏదైనా ఉత్పాతం సంభవించినప్పుడు ఫేక్ న్యూస్ వెల్లువెత్తుతుంటాయి. నిజానిజాలను మించిన ఆకర్షణీయతతో చూడగానే ఇట్టే చదవాలనిపిస్తుంటాయి. ఇక, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలవిల్లాడిస్తుంటే ఫేక్ న్యూస్ సృష్టిదారులకు కావాల్సిందేముంది..! ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా పుకార్లను, తప్పుడు వార్తలను వదులుతున్నారు. వాస్తవ కథనాల కంటే ఇవే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని ఎన్నోసార్లు నిరూపితమైంది. ఈ నేపథ్యంలో వీటి అంతు చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యాక్ట్ చెక్' పేరుతో ప్రత్యేక ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పోర్టల్ లో ఏదైనా న్యూస్ లింకును పోస్టు చేస్తే అది రియల్ న్యూసో, ఫేక్ న్యూసో చెప్పేస్తుంది. ఆ విధంగా ఇప్పటివరకు ఎన్నో తప్పుడువార్తలను పట్టేసింది. తాజాగా, మరికొన్ని ఫేక్ న్యూస్ బండారాన్ని కూడా 'ఫ్యాక్ట్ చెక్' బట్టబయలు చేసింది. కరోనా టీకా వేయించుకున్న మొదటి మహిళ మృతి అంటూ ఓ టీవీ చానల్ లో రాగా, అదే వార్తను అనేకమంది షేర్ చేస్తున్నారని, ఇది ఫేక్ న్యూస్ అని 'ఫ్యాక్ట్ చెక్' స్పష్టం చేసింది. మరో ఘటనలో, చైనా తన ల్యాబ్ లో కరోనాను పుట్టించిందని ఓ జపాన్ నోబెల్ గ్రహీత అన్నట్టుగా ఫేక్ న్యూస్ పుట్టించారు. ఇది కూడా తప్పుడు వార్తేనని, సదరు నోబెల్ గ్రహీతకు చెందిన వెబ్ సైట్లో ఆ ప్రకటన ఎక్కడా లేదని 'ఫ్యాక్ట్ చెక్' తేల్చింది.

ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల ప్రముఖులను కూడా ఇందులోకి లాగుతున్నారని, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సందేశం అంటూ ఓ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని సదరు పోర్టల్ వివరించింది. వచ్చే రెండు నెలలు భారత్ పూర్తిగా లాక్ డౌన్ లో ఉండబోతోందన్నది ఆ ఆడియో సందేశం సారాంశం. లాక్ డౌన్ పొడిగించాలన్న విషయాన్ని భారత్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని, అందుకే రెండు నెలలకు సరిపడా ఆహారం, ఔషధాలు అందుబాటులోకి ఉంచుకోవాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. అయితే అది తన గొంతు కాదని లక్ష్మీనారాయణ వివరణ ఇచ్చారని 'ఫ్యాక్ట్ చెక్' వెల్లడించింది.

ఇక, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తమ మతపెద్దకు ఓ నర్సుతో కాళ్లు మొక్కిస్తున్నాడంటూ ఒక ఫొటో సందడి చేస్తోంది. దీనిపైనా 'ఫ్యాక్ట్ చెక్' కూపీ లాగింది. వాస్తవానికి ఆ మతపెద్ద కాలికి గాయం కావడంతో రక్తస్రావాన్ని అరికట్టేందుకు నర్సు చికిత్స చేస్తున్నప్పటి ఫొటో అని స్పష్టం చేసింది. కొన్ని దేశాలు కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను సముద్రంలోకి విసిరి వేస్తున్నాయంటూ వస్తున్న వార్తలను కూడా 'ఫ్యాక్ట్ చెక్' అబద్ధాలని నిరూపించింది. ఇది ఐదేళ్ల నాటి వీడియో అని, యూరప్ వలస వెళుతున్న ఆఫ్రికా వాసులతో కూడిన పడవ మునిగిపోవడంతో ఈ వీడియో తీశారని వివరించింది.

మరో ఉదంతంలో, దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉండగా యూపీలో శ్రీరామనవమి జరిపారంటూ ప్రచారం జరిగింది. ఓ వీడియో కూడా తెరపైకి వచ్చింది. అయితే ఆ వీడియో బీహార్ కు చెందినదని, పైగా లాక్ డౌన్ కు ముందు తీసినదని 'ఫ్యాక్ట్ చెక్' పేర్కొంది. అటు, ఇజ్రాయెల్ దేశం కరోనాకు మందు కనుగొందని, అందుకే అక్కడెవరూ కరోనాతో మరణించలేదని ఓ సందేశం వ్యాప్తి చెందింది. వేడినీళ్లలో నిమ్మకాయ, బేకింగ్ సోడా కలిపి తేనీటిలా సేవిస్తే కరోనా తగ్గిపోతుందని ఈ సందేశంలో పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ లోనూ వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్న విషయాన్ని 'ఫ్యాక్ట్ చెక్' వెల్లడించింది.

అంతేగాకుండా, కరోనా నివారణ చర్యల పర్యవేక్షణ కోసం ప్రధాని మోదీ ఖరీదైన దుస్తులు వేసుకుని ఓ ఆసుపత్రిని సందర్శించినట్టు ఓ ఫొటో వైరల్ అవుతోంది. అయితే ఇది రెండేళ్ల కిందటి ఫొటో అని, శ్రీలంకలో 'డికోయా గ్లెంగైరాన్' ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నపటి దృశ్యం అని 'ఫ్యాక్ట్ చెక్' స్పష్టం చేసింది. వీటిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశం నిజం కాదని, ఇతరులతో పంచుకునే ముందు తప్పనిసరిగా నిర్ధారణ చేసుకోవాలని, అసత్యాలు ప్రచారం చేస్తే సంబంధిత చట్టాల ప్రకారం శిక్షలు ఉంటాయని హెచ్చరించింది.

More Telugu News