Kanika Kapoor: ఇంతకాలమూ అందుకే నోరు మూసుకుని కూర్చున్నా: గాయని కనికా కపూర్

  • యూకే నుంచి వచ్చి పార్టీలకు హాజరైన కనికా కపూర్
  • కరోనా సోకడంతో ఆమెపై పలు విమర్శలు
  • తాను కలిసిన వారెవరికీ కరోనా సోకలేదని వివరణ
Kanika Kapoor Post in Instagram

గత నెలలో విదేశాలకు వెళ్లి వచ్చిన తరువాత, కరోనా బారిన పడిన కనికా కపూర్, తనపై వచ్చిన విమర్శలపై తొలిసారిగా నోరు విప్పింది. యూకే నుంచి వచ్చిన తరువాత, ఆమె లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా ముంబయి, లక్నో ప్రాంతాల్లో పలువురిని కలవడం, పార్టీలకు హాజరు కావడం, ఈ పార్టీలకు పలువురు సెలబ్రిటీలు రావడం, ఆపై కనికాకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకుని లక్నోలోని తన కుటుంబ సభ్యులతో క్వారంటైన్ ను కొనసాగిస్తూ, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.

"యూకే, ముంబై, లక్నోల్లో నేను కలిసిన వ్యక్తుల్లో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. నాకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత వారికి పరీక్షలు చేయిస్తే నెగిటివ్ అని తేలింది.   ఇన్నాళ్లూ నేను నోరు మెదపకుండా వున్నది నేను తప్పు చేశానని కాదు, అంతా తెలిసి కూడా అపార్థాలు చోటుచేసుకున్నాయని, సమాచార మార్పిడిలో లోపం వుందని భావించడం వల్లే. నన్ను దోషిగా చూపిస్తూ అనేక కథనాలు ప్రచారం చేశారు. వాటికి కాలమే సమాధానం చెబుతుంది" అని వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు అసలు విషయం బయటకు వస్తుందనే భావించానని, తనపై అసత్యాలు ప్రచారం చేసిన వాళ్లు పశ్చాత్తాప పడి తీరుతారని పేర్కొంది.

కాగా, మార్చి 10న యూకే నుంచి ముంబైకి వచ్చిన ఆమెకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించారు. అప్పటికి హోమ్ క్వారంటైన్ నిబంధన లేకపోవడంతో ఆమెను బయటకు పంపించారు. 11న ఆమె బంధువులను కలిసేందుకు లక్నో వెళ్లింది. ఆపై మార్చి 18న క్వారంటైన్ నిబంధనలు విడుదలయ్యాయి. ఈలోగా కనికా కపూర్ పలు పార్టీలకు వెళ్లింది. మార్చి 17, 18 తేదీల్లో ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చింది. యూపీ పోలీసులు ఆమె నిబంధనలను అతిక్రమించిందని కేసు కూడా రిజిస్టర్ చేశారు.

More Telugu News