India: ఆక్స్ ఫర్డ్ తో భారత కంపెనీ డీల్... మూడు వారాల్లో కరోనా వాక్సిన్ తయారీ మొదలు!

  • అక్టోబర్ నాటికి అందుబాటులోకి వాక్సిన్
  • హ్యూమన్ ట్రయల్స్ విజయవంతమైతే వెంటనే తయారీ
  • గతంలో మలేరియా వాక్సిన్ కోసం పనిచేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్
  • తొలి ఆరు నెలల్లో నెలకు 50 లక్షల డోస్ ల చొప్పున ఉత్పత్తి 
Serum Institute Says It Will Start Vaccine Manufacturing in 3 Weeks

ఇండియా కేంద్రంగా పలు రకాల వాక్సిన్ లను తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, రెండు నుంచి మూడు వారాల్లో ఇండియాలోనే కరోనాకు వాక్సిన్ ను తయారుచేయడాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో తాము ఒప్పందం చేసుకున్నామని, అన్నీ సరిగ్గా ఉండి, హ్యూమన్ ట్రయల్స్ విజయవంతం అయితే, అక్టోబర్ నాటికే వాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ భారత సీఈఓ అదార్ పొన్నావాలా వ్యాఖ్యానించారు.

తాము అభివృద్ధి చేసిన వాక్సిన్ ఫలవంతం అయితే, బల్క్ గా తయారు చేసేందుకు ఆక్స్ ఫర్డ్ డీల్ కుదుర్చుకున్న ఏడు గ్లోబల్ ఔషధ సంస్థల్లో పూణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా ఒకటి. "ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ హిల్ తో మా టీమ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వాక్సిన్ తయారీ ప్రారంభమైతే తొలి ఆరు నెలల కాలంలో నెలకు 50 లక్షల డోస్ ల చొప్పున సిద్ధం చేస్తాం. ఆపై ప్రొడక్షన్ కెపాసిటీని నెలకు కోటి డోస్ లకు పెంచాలన్న ఆలోచనతో ఉన్నాము" అని అదార్ పొన్నావాలా తెలియజేశారు.

గతంలో మలేరియాకు వాక్సిన్ ను అభివృద్ధి చేసిన వేళ, ఆక్స్ ఫర్డ్ వర్శిటీతో సీరమ్ జట్టు కట్టింది. ఇక ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ పై ప్రపంచ దేశాలు ఎన్నో ఆశలతో ఉన్నాయి. ఇక్కడ అత్యుత్తమ శాస్త్రవేత్తలు ఉండటం, వారు గతంలో ఎన్నో ప్రాణాంతక వైరస్ లను నివారించే వాక్సిన్ లను సృష్టించడమే ఇందుకు కారణం.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న హ్యూమన్ ట్రయల్స్ విజయవంతం అయితేనే వాక్సిన్ సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య కాలంలో మార్కెట్లోకి వస్తుందని, ఇప్పుడు పరిశీలిస్తున్న వాక్సిన్ ఏ మేరకు ప్రభావం చూపగలదన్న విషయం మరో రెండు వారాల్లో తేలిపోతుందని పొన్నావాలా వెల్లడించారు. లండన్ లో జరుగుతున్న పరీక్షల తరువాత, ఇండియాలోనూ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేశామని కూడా ఆయన తెలిపారు.

More Telugu News