Telangana: తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపునకే కేసీఆర్ మొగ్గు!

Lockdown in Telangana May Extend
  • ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కేసులు
  • లాక్ డౌన్ ఒక్కటే రాష్ట్రం ముందున్న మార్గం
  • ప్రధానితో మాట్లాడిన తరువాత తదుపరి నిర్ణయం
తెలంగాణలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మే 7 తరువాత, మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రజలంతా ఇళ్లలో ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వ్యాఖ్యానించిన ఆయన, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫెరెన్స్ లో దేశంలో పరిస్థితి తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, ప్రధానితో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుందామని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది.

ఇక కేసుల సంఖ్య అధికంగా ఉన్న రాజధాని నగరంపై మరింత దృష్టిని సారించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని సూచించారు.

కాగా, ఇప్పటివరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటగా, 316 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 25 మంది మరణించారు. ఆదివారం నాడు కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి.
Telangana
Corona Virus
Lockdown
Extend
KCR

More Telugu News