North Korea: ఆహార కొరతతో అల్లాడుతున్న ఉత్తరకొరియా ప్రజలు!

  • కిమ్ జాంగ్ అనారోగ్య వార్తలతో సతమవుతున్న ఉత్తరకొరియా
  • తాజాగా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న ప్యాంగ్యాంగ్
  • 90వ దశకంలో కూడా ఆహార కొరతతో భారీ మరణాలు
North Korea is suffering with food problem

ఇప్పటికే ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారంటూ పలు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ దేశ పరిస్థితి చాలా దీనంగా ఉందంటూ మీడియా సంస్థ ఎస్కే న్యూస్ వెల్లడించింది.

ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో నిత్యావసరాలు కూడా దొరకడం లేదని కథనంలో పేర్కొంది. ఆహార నిల్వలు నిండుకున్నాయని తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా నిత్యావసరాల కొనుగోళ్లపై ఆంక్షలు విధించి ఉండవచ్చని అభిప్రాయపడింది. కిమ్ జాంగ్ అనారోగ్యానికి గురవుతారనే విషయాన్ని ఊహించి ఉండకపోవచ్చని తెలిపింది.

తొలుత వెజిటబుల్స్, పండ్లు దిగుమతిపై ఆంక్షలు విధించారని... తర్వాత వాటిని ఇతర నిత్యావసరాలకు కూడా పొడిగించినట్టు ప్యాంగ్యాంగ్ లోని ప్రజలు చెప్పారని ఎస్కే న్యూస్ పేర్కొంది. ఉత్తరకొరియాలో ఆహార కొరత ఏర్పడటం ఇదే ప్రథమం కాదు. ప్రపంచ పేద దేశాల్లో ఒకటైన ఉత్తరకొరియాలో ఆహార పదార్థాల కొరత సర్వసాధారణం. 90 దశకంలో కూడా ఆహార కొరతతో దేశ జనాభాలో 10 శాతం మంది చనిపోయారని నివేదికలు చెపుతున్నాయి.

చైనాలో కరోనా పెరుగుతున్న తరుణంలోనే ఉత్తరకొరియా తన సరిహద్దులను మూసేసింది. తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని ఇంతకు ముందే  ప్రకటించింది.

మరోవైపు, కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం పూర్తిగా విషమించిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన కోమాలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. అయితే ఉత్తరకొరియా మాత్రం దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉత్తరకొరియా మీడియా సైతం దీనిపై మౌనంగా ఉంది.

More Telugu News