Supreme Court: మరికొంత కాలం వేచి చూడాల్సిందే... యూఎస్ లో చిక్కుబడిపోయిన భారతీయులను వెనక్కి రప్పించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య!

  • ఇండియన్స్ ను వెనక్కి రప్పించాలంటూ పిటిషన్
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన ధర్మాసనం
  • భారతీయులంతా క్షేమంగానే ఉన్నారని వ్యాఖ్య
  • వెంటనే రప్పించేలా ఆదేశాలు ఇవ్వలేమన్న కోర్టు
Supreem Court Comments on Evacuating Indians from USA

అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన భారత విద్యార్థులు, పౌరులను వెనక్కు రప్పించే దిశగా, ఇప్పటికిప్పుడు ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేమని, ప్రస్తుతానికి ఎక్కడి వారు అక్కడే ఉండాలని, మరికొంత కాలం వేచి చూడాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యూఎస్ లో చిక్కుకుపోయిన వారిని తిరిగి ఇండియాకు రప్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం, ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. భారతీయులు క్షేమంగానే ఉన్నారని, వారికి అవసరమైన సహాయాన్ని అటు యూఎస్, ఇటు భారత్ అందిస్తూనే వున్నాయని వ్యాఖ్యానించింది.

తమ దేశంలో ఉన్న భారతీయుల వీసాల గడువును అమెరికా పొడిగించిందన్న విషయాన్ని గుర్తు చేసిన సుప్రీంకోర్టు, వారిని వెనక్కు రప్పించేలా ఇప్పుడు ఆదేశాల జారీ కష్టమేనని అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి ఒక దేశాన్ని పట్టుకున్న సమస్య కాదని, అది అన్ని దేశాలకూ ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించిన జస్టిస్ ఎన్వీ రమణ, ఎస్కే కౌల్, బీఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం, ప్రతి దేశమూ వైరస్ వ్యాప్తిని అణచి వేసేందుకు తన వంతు కృషి చేస్తోందని పేర్కొంది.

అమెరికా వ్యాప్తంగా భారతీయులు ఉన్నారని, వారందరి వీసాలనూ పొడిగించారని, మరికొంత కాలం వేచి చూసి ఓ నిర్ణయం తీసుకుందామని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాది విభా దత్తా మఖీజా, యూఎస్ లో వీసా పొడిగింపునకు 500 డాలర్లు చెల్లించాలని, అప్పటికీ, వీసాను పొడిగిస్తారన్న గ్యారంటీ లేదని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన న్యాయస్థానం, ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాలను ఇక్కడి నుంచి నియంత్రించలేమని, ఇదే సమయంలో మనవారికి ఎటువంటి సమస్యలూ రాకుండా చూడాలని ప్రభుత్వం తరఫున విన్నవించడం ఒక్కటే చేయగలమని పేర్కొంది.

More Telugu News