Corona Testing Kit: హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ రూపొందించిన కరోనా టెస్టింగ్ కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదం

  • దేశీయంగా కిట్ రూపొందించిన హువెల్ లైఫ్ సైన్సెస్
  • ఇటీవలే అనుమతులు మంజూరు చేసిన ఐసీఎంఆర్
  • మరికొన్నిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి
ICMR approves corona testing kit made by Hyderabad based startup

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విపత్కర పరిస్థితులు కళ్లెదుట కఠోర వాస్తవాలై నిలుస్తున్న వేళ, దేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో టెస్టింగ్ కిట్లు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్ల కొరత, తక్కువ సంఖ్యలో జరుగుతున్న పరీక్షలు కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు విదేశాల నుంచి టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే వాటి ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా, చీకట్లో కాంతిరేఖలా హైదరాబాద్ కు చెందిన హువెల్ లైఫ్ సైన్సెస్ స్టార్టప్ కంపెనీ దేశీయంగా కరోనా టెస్టింగ్ కిట్లు రూపొందించింది. ఈ సంస్థ తయారుచేసిన టెస్టింగ్ కిట్లకు అఖిల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది.

హువెల్ లైఫ్ సైన్సెస్ సంస్థ జనవరి నుంచి టెస్టింగ్ కిట్ల తయారీలో నిమగ్నమై ఉండగా, ఐసీఎంఆర్ నుంచి ఇటీవలే అనుమతులు లభించాయి. హువెల్ లైఫ్ సైన్సెస్ స్టార్టప్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం, రిలయన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థలు తోడ్పాటునందిస్తున్నాయి. త్వరలోనే ఈ సంస్థ పూర్తిస్థాయిలో టెస్టింగ్ కిట్లను తయారుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News