Pakistan: గుట్టుచప్పుడు కాకుండా నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించిన పాకిస్థాన్

US startup reveals Pak amended banned terrorist list
  • తాజాగా 1,800 ఉగ్రవాదుల పేర్లు జాబితా నుంచి తొలగింపు
  • రెండేళ్ల కిందట జాబితాలో 7,600 మంది పేర్లు
  • ఇప్పుడా జాబితాలో ఉన్నది 3,800 మాత్రమే!
  • పాక్ కుయుక్తులను బట్టబయలు చేసిన అమెరికా స్టార్టప్ కంపెనీ
ఓవైపు తక్కిన ప్రపంచం అంతా కరోనాపై పోరాటంలో తలమునకలై ఉన్నవేళ, పాకిస్థాన్ మాత్రం ఇదే అదనుగా నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించింది. దాదాపు 1,800 మంది ఉగ్రవాదులను ఈ జాబితా నుంచి తొలగించింది. వాస్తవానికి ఈ జాబితాను ఇప్పటికిప్పుడు సవరించాల్సినంత తీవ్ర పరిస్థితులు ఏమీలేవు. రెండేళ్ల కిందట నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాలో 7,600 మంది పేర్లున్నాయి. ఇప్పుడా జాబితాలో ఉన్న ఉగ్రవాదుల సంఖ్య 3,800 మాత్రమేనంటే పాక్ ఎన్ని విడతలుగా సవరించిందో అర్థమవుతోంది.

ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో పాక్ పై ఎఫ్ఏటీఎఫ్ (ప్రపంచ ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్) అసంతృప్తితో ఉంది. పాక్ తీరు ఇదేవిధంగా ఉంటే మరికొన్నాళ్లలో పాక్ ను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టులో చేర్చడం తథ్యమన్న వార్తల నేపథ్యంలో, పాక్ దొంగచాటుగా నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించినట్టు తెలుస్తోంది.

పాక్ నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించిన విషయాన్ని అమెరికాకు చెందిన కాస్టెల్లమ్.ఏఐ అనే స్టార్టప్ సంస్థ వెల్లడించింది. పాక్ ఈ జాబితా నుంచి తొలగించిన ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబా అగ్రశ్రేణి కమాండర్ జకీర్ ఉర్ రెహ్మాన్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. జకీర్ ఉర్ రెహ్మాన్ 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి. ఇలాంటి జాబితాలు సవరించినప్పుడు ఆ వివరాలను సదరు దేశం అంతర్జాతీయ సమాజానికి వెల్లడించాల్సి ఉంటుంది. కానీ పాక్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని తాజా ఘటనతో తేలింది.
Pakistan
Terrorists
Ban
List
FATF

More Telugu News