Stock Market: క్రూడాయిల్ దెబ్బకు స్టాక్ మార్కెట్ల భారీ పతనం!

  • దాదాపు 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • గడచిన రెండు సెషన్ల లాభాలు ఆవిరి
  • నష్టాల్లో ముగిసిన ఆసియా, యూఎస్ మార్కెట్లు
Stock Market Loss

క్రూడాయిల్ భారీ పతనం ప్రభావం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దిగజార్చడంతో ఈ ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. దీంతో గడచిన రెండు సెషన్ లలో మార్కెట్లు నమోదు చేసిన లాభం ఆవిరైపోయింది. సెన్సెక్స్ 31 వేల స్థాయిని, నిఫ్టీ 9,100 స్థాయి నుంచి పడిపోయాయి. అన్ని సెక్టార్లలోని ప్రధాన కంపెనీల ఈక్విటీల విలువ నష్టపోయింది. బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ విభాగాల్లో నష్టం అధికంగా ఉంది.

ఈ ఉదయం 10.30 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 853 పాయింట్లు పడిపోయి 2.70 శాతం నష్టంతో 30,795 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ, 243 పాయింట్లు పడిపోయి 2.63 శాతం నష్టంతో 9,018 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. ఓ దశలో సెన్సెక్స్ సుమారు 1000 పాయింట్లు నష్టపోవడం గమనార్హం.

డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు లాభాల్లో ఉండగా, హిందాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.

సోమవారం నాటి అమెరికా మార్కెట్ల ఒక శాతం నష్టం కూడా నేడు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు ప్రోత్సహించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక నేటి ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, నిక్కీ 2.01 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 1.42 శాతం, హాంగ్ సెంగ్ 2.29 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 2.51 శాతం, కోస్పి 1.63 శాతం, సెట్ కాంపోజిట్ 0.76 శాతం, జకార్తా కాంపోజిట్ 1.90 శాతం, షాంగై కాంపోజిట్ 1.35 శాతం నష్టపోయాయి.

More Telugu News