Lockdown: యువకుడి మృతిపై విచారణ జరుపుతున్నాం.. సత్తెనపల్లి ఎస్సైను సస్పెండ్ చేస్తున్నాం: ఐజీ ప్రభాకర్‌ రావు

  • పోలీసుల దెబ్బలకు సత్తెనపల్లి యువకుడి మృతి?
  • విచారణలో నిజాలు తేలతాయని వ్యాఖ్య
  • యువకుడు ఆసుపత్రిలోనే చనిపోయాడని వివరణ
sattenapalli si suspends

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు బయటకు రాగా అతడిని పోలీసులు కొట్టారని, దీంతో అతడు చనిపోయాడని తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. మహమ్మద్ గౌస్ అనే యువకుడి మృతిపై గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్‌ రావు వివరణ ఇచ్చారు. సత్తెనపల్లిలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. షేక్‌గౌస్‌ అనే వ్యక్తిని ఆపేందుకు అక్కడ విధులు నిర్వహిస్తోన్న ఎస్‌ఐ రమేశ్‌ బాబు ప్రయత్నించారని వివరించారు. అయితే, అప్పటికే షేక్‌ గౌస్‌కు చమటలు పట్టడంతో కిందపడిపోయాడని చెప్పారు.

దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ అతడు ఆసుపత్రిలో మరణించాడని ప్రభాకర్‌రావు వివరించారు. షేక్‌ గౌస్‌కు హృదయ సంబంధ సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేగాక, అతడి మృతదేహంపై గాయాలేవీ లేవని ఆయన చెప్పారు. ఈ ఘటనపై  విచారణ జరుపుతున్నామని వివరించారు. అసలు నిజాలు విచారణలో తేలతాయని తెలిపారు. ఎస్‌ఐను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలు బయటకు రావద్దని ఐజీ సూచించారు.

More Telugu News