ఇల్లే ఆఫీసు, ఇంటర్నెట్టే మీటింగ్ రూమ్... కరోనా ఎలా మార్చేసిందో చూడండి: మోదీ

19-04-2020 Sun 22:02
  • లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమైన ప్రజానీకం
  • ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఒడిదుడుకులతో ప్రారంభమైందని వెల్లడి
  • లింక్డిన్ లో మోదీ పోస్టు
PM Modi tells about his work from home experience
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 రాకతో ప్రజా జీవితాలు సరికొత్త పంథాలో పయనిస్తున్నాయని, తన విషయానికొస్తే ఇల్లే ఆఫీసులా మారిపోయిందని, ఇంటర్నెట్టే మీటింగ్ రూం అయిందని అభివర్ణించారు. ఇంటి నుంచే దేశ పరిపాలన సాగిస్తున్నానని, సమావేశాలు నిర్వహించాలంటే ఇంటర్నెట్ సాయంతో చేపడుతున్నానని తెలిపారు.

"ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఒడిదుడుకులతో ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో మార్పులకు లోనైంది. సహోద్యోగులతో ఆఫీసు బ్రేక్ లో పిచ్చాపాటీలు గత చరిత్రలో కలిసిపోయాయి. నేను కూడా ఈ మార్పులకు అతీతుడ్నేమీ కాను. క్యాబినెట్ సహచరులు, ఉన్నతాధికారులతో మాట్లాడాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నాను" అని వెల్లడించారు. ఈ మేరకు లింక్డిన్ సైట్ లో పోస్టు చేసి ఆ లింకును ట్విట్టర్ లో పంచుకున్నారు.