China: చైనాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న అగ్ర దేశాలు.. తీవ్ర ఒత్తిడిలో డ్రాగన్ దేశం!

China Under Mounting Pressure Over Virus Origins
  • ప్రపంచాన్ని నాశనం చేస్తున్న కరోనా మహమ్మారి
  • చైనానే కారణం అంటున్న దేశాధినేతలు
  • దూకుడు పెంచుతున్న డొనాల్డ్ ట్రంప్
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ, దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తూ, వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్... ఇప్పుడు చైనాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనాను పుట్టించారని... ఈ ప్రపంచ విపత్తుకు డ్రాగన్ దేశమే కారణమంటూ అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తున్నాయి.

చైనాను దోషిగా నిలబెట్టే చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వం వహిస్తున్నారు. చైనాపై సూటిగానే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలో మరణాల సంఖ్య 30 వేలను దాటడంతో... ట్రంప్ దూకుడు మరింత పెరిగింది. మరోవైపు చైనాను ఒంటరి చేసేందుకు గ్రూప్-7 దేశాధినేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లు కూడా నిర్వహించారు.

ఈ క్రమంలో ఆర్థికంగా బలమైన దేశాలన్నీ చైనాను దోషిగానే చూస్తున్నాయి. బ్రిటీష్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, చైనాతో ఇంతకు ముందు మాదిరి వ్యాపార లావాదేవీలు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. కరోనా ఎలా పుట్టింది? దాన్ని వెంటనే ఎందుకు కట్టడి చేయలేకపోయారు? వంటి ప్రశ్నలు చైనా ముందు ఉంచుతామని చెప్పారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ, కరోనాను కట్టడి చేసేందుకు చైనా చేస్తున్న యత్నాలు నమ్మశక్యంగా లేవని చెప్పారు. ప్రపంచానికి తెలియనివి చైనాలో జరిగాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ, వూహాన్ లోని ల్యాబ్ గురించి చైనా పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వైరస్ ప్రపంచంలోకి ఎలా వచ్చిందనే దానిపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని చెప్పారు.

ప్రపంచంలోని అగ్ర దేశాలు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంపై చైనా కలవరపాటుకు, తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ నేపథ్యంలో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రష్యా  అధినేత పుతిన్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. చైనాపై విమర్శలు గుప్పిస్తున్న దేశాలను ఎదుర్కోవడంపై చర్చించారు. కరోనా మహమ్మారిని రాజకీయం కోసం వాడుకుంటున్నారని జిన్ పింగ్ ఈ సందర్భంగా అన్నారు. చైనాపై బురద చల్లేందుకు కొందరు యత్నిస్తున్నారని పుతిన్ అభిప్రాయపడ్డారు.

ఏదేమైనప్పటికీ... కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా ఆగిపోయిన తర్వాత కూడా... దీని ప్రకంపనలు మాత్రం కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, భారీ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్న నేపథ్యంలో... చైనాను ఇతర దేశాలు అంత ఈజీగా వదలకపోవచ్చు. అంతర్జాతీయ కోర్టుకు కూడా చైనాను లాగవచ్చు. ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి మరింతగా పెరుగుతోంది. మరి ఏం జరగబోతుందో వేచి చూడాలి.
China
Corona Virus
Wuhan
Lab
USA
West Countries
Donald Trump
Jinping
Putin

More Telugu News