Vijay Sai Reddy: నిమ్మగడ్డ లేఖలో నిగ్గు తేలాల్సిన అంశాలు మూడు ఉన్నాయి: విజయసాయిరెడ్డి

  • మరోసారి రాజకీయ దుమారం రేపుతున్న 'నిమ్మగడ్డ లేఖ'
  • కలుగులో ఎలుకలన్నీ బయటికి వస్తాయన్న విజయసాయి
  • నిమ్మగడ్డకు ముచ్చెమటలు పట్టినట్టున్నాయంటూ వ్యాఖ్యలు
Vijaysai Reddy tweets over Nimmagadda letter issue

కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది తానేనంటూ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించడంతో ఏపీలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించారు. నిమ్మగడ్డ లేఖ అంశంలో నిగ్గు తేలాల్సిన అంశాలు మూడు ఉన్నాయని ట్వీట్ చేశారు. నిమ్మగడ్డ పేరుతో లేఖపై సంతకం చేసింది ఎవరు? ఆ లేఖను ఏ ఐపీ చిరునామా ద్వారా హోంశాఖ అధికారికి మెయిల్ చేశారు? అసలు ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారు? అనే మూడు అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలితే కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బయటికి వస్తాయని వ్యాఖ్యానించారు.

కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద నోరు విప్పకుండా హైదరాబాద్ జారుకున్న నిమ్మగడ్డకు ఆ లేఖ విషయంలో పోలీసుల దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు పట్టినట్టున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే నెల తర్వాత, ఆ లేఖ రాసింది తానే అంటున్నారని విమర్శించారు. లేఖపై దర్యాప్తు జరిగితే ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందో ఇప్పటికి బోధపడినట్టయింది అంటూ మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.

More Telugu News