America: అమెరికాలో కరోనా విధ్వంసం.. న్యూయార్క్‌లో 10 వేలు దాటిన మరణాలు!

  • మంగళవారం దేశంలో 2,129 మంది మృతి
  • న్యూయార్క్‌లో 10 వేలు దాటిన మరణాలు
  • ఆ లెక్కలు తప్పంటున్న నిపుణులు
New York Register Another 2129 Covid Cases on Tuesday

అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదులుతున్నారు. దేశంలోనే తొలిసారి మంగళవారం అత్యధికంగా 2,129 మందిని ఈ వైరస్ బలితీసుకుంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 26 వేలు దాటిపోయింది. ఈ మరణాల్లో సగం న్యూయార్క్‌  రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. ఇక్కడ మంగళవారం వరకు 10,367 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ లెక్కలు తప్పని, ఒక్క న్యూయార్క్ నగరంలోనే 10 వేల మందికిపైగా చనిపోయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం మంగళవారం నాటికి ఇక్కడ మృతి చెందింది 6,589 మంది మాత్రమేనని చెబుతోంది. కోవిడ్-19, లేదంటే మరో వ్యాధి కారణంగా మరో 3,778 మంది మృతి చెందారని, వారిని ఈ లెక్కల్లో కలపలేదని న్యూయార్క్ ఆరోగ్య కమిషనర్ ఆక్సిరిస్ బార్బోట్ తెలిపారు. వారిని కూడా కలిపితే మృతుల సంఖ్య పదివేలు దాటుతుందన్నారు. కాగా, కోవిడ్ కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల న్యూయార్క్‌లో దాదాపు రూ. 76 వేల కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని మేయర్ బిల్ డి బ్లాసియో తెలిపారు.

More Telugu News