Love Agarwal: లాక్ డౌన్ -2 కొనసాగుతున్నా.. ఈ నెల 20 నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇస్తాం: లవ్ అగర్వాల్

  • వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతిస్తాం
  • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మండీల నిర్వహణకు కూడా
  • ఈ- కామర్స్ సంస్థలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ల సేవలకూ అనుమతిస్తాం
Love Agarwal press meet

లాక్ డౌన్ -2  కొనసాగుతున్నప్పటికీ ఈ నెల 20 నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మండీలకు,  అనుమతించనున్నట్టు చెప్పారు. వ్యవసాయ పరికరాలు, విడిభాగాలు విక్రయించే దుకాణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దెకు ఇచ్చే సంస్థలు, విత్తనోత్పత్తి, ఎరువులు, పురుగుమందుల దుకాణాలు తెరిచేందుకు అనుమతినిస్తున్నట్టు తెలిపారు.

అదేవిధంగా, పంటకోత యంత్రాల రవాణాకు, ఉపాధి హామీ పనులు చేసేందుకు అనుమతినిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతినిస్తున్నామని, భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అమనుతులు ఇస్తామని చెప్పారు.

 పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న కూలీలతోనే భవన నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. 50 శాతం సిబ్బందితో ఐటీ సంస్థలు, సేవల నిర్వహణకు, ఈ- కామర్స్ సంస్థలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్స్, కార్పెంటర్ల సేవలకు అనుమతినిస్తామని తెలిపారు.

More Telugu News