ఇద్దరు యువకులను కటకటాల్లోకి నెట్టిన టిక్‌టాక్ వీడియో!

14-04-2020 Tue 08:09
  • హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ప్రాంతంలో ఘటన
  • మద్యం పోస్తూ టిక్‌టాక్ చేసిన యువకులు
  • మంత్రి దృష్టికి వీడియో.. యువకుల అరెస్ట్
Two youth arrested for doing video with liquor in Hyderabad

టిక్‌టాక్ వీడియోల్లో కొంత వెరైటీ చూపించాలనుకున్న ఇద్దరు యువకులు జైలుపాలయ్యారు. ఇంతకీ ఏ జరిగిందంటే.. హైదరాబాద్‌లోని ఈద్ బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు కుమార్‌ సంజూ, నితిన్‌ టిక్‌టాక్ వీడియోలు చేస్తుంటారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈసారి కొంత విభిన్నంగా వీడియోలు చేయాలని తలపోశారు. ఇందుకోసం మద్యాన్ని ఎంచుకున్నారు. మందుబాబులకు మద్యం పోస్తూ టిక్‌టాక్ వీడియోలు చేశారు.

అనంతరం ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇవి కాస్తా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టిలో పడ్డాయి. వెంటనే స్పందించిన ఆయన లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించడంతోపాటు మద్యాన్ని అక్రమంగా సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.