కరోనా లాక్ డౌన్ రోజుల్లో పుట్టాడని బాబుకు ఏం పేరు పెట్టారో చూడండి!

13-04-2020 Mon 18:23
  • కరోనా పదాలతో బిడ్డలకు పేర్లు పెడుతున్న తల్లిదండ్రులు
  • యూపీలో మగశిశువుకు 'శానిటైజర్' అంటూ నామకరణం
  • ఇప్పుడు దేశంలో 'శానిటైజర్' కీలక పాత్ర పోషిస్తోందన్న బిడ్డ తండ్రి
Baby boy named as Sanitizer in Uttar Pradesh

గత కొన్నినెలలుగా ప్రపంచం యావత్తు కరోనా నామస్మరణలో మునిగితేలుతోంది. సామాన్య జనానికి పెద్దగా తెలియని లాక్ డౌన్, క్వారంటైన్, ఐసోలేషన్, శానిటైజర్ వంటి పదాలు ఇప్పుడు విరివిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ పుట్టిన చిన్నారులకు కరోనా, దాని సంబంధిత పదాలతో పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే కరోనా కుమారి, కరోనా కుమార్, లాక్ డౌన్, కొవిడ్ అంటూ కొన్నిప్రాంతాల్లో పిల్లలకు నామకరణం చేశారు.

తాజాగా, ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో జన్మించిన ఓ పండంటి బాబుకు ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. సహరాన్ పూర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఆదివారం ఓ చిన్నారి జన్మించాడు. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు 'శానిటైజర్' అని నామకరణం చేశారు. దీనిపై ఆ శిశువు తండ్రి ఓమ్ వీర్ మీడియాతో మాట్లాడుతూ, కరోనా నుంచి కాపాడుకోవడంలో శానిటైజర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వాలు కూడా శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయని తెలిపాడు. మన చేతులకున్న క్రిములను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించేది శానిటైజర్ అని, దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారని, అందుకే తమ బిడ్డకు 'శానిటైజర్' అని పేరు పెట్టామని వివరించాడు.