Boy Friend: సూట్ కేసులో ఫ్రెండ్ ను పెట్టి... లాక్ డౌన్ వేళ ఇంట్లోకి తీసుకెళ్లేందుకు కుర్రాడి ప్లాన్!

Teenager Takes Boy Friend in Suit Case to Apartment
  • స్నేహితుడిని సూట్ కేసులో పెట్టిన కుర్రాడు 
  • ఇరుగు పొరుగుకు అనుమానం రావడంతో విషయం బట్టబయలు
  • కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతున్న వేళ, బోర్ కొట్టడంతో తన ఫ్రెండ్ ను అపార్ట్ మెంట్ లోకి ఎలాగైనా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఓ టీనేజ్ కుర్రాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసి కొట్టింది. తన స్నేహితుడిని పెద్ద సూట్ కేసులో పెట్టి తీసుకుని వస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కరోనా భయంతో ఓ అపార్టుమెంట్ కమిటీ బయటి వారు లోపలికి రావడానికి వీల్లేదని నిబంధన విధించింది.

అదే అపార్టుమెంట్ లో ఉంటున్న ఓ టీనేజ్ కుర్రాడు, తన స్నేహితుడిని ఇంటికి ఆహ్వానించాడు. అయితే, అతను వచ్చేందుకు వీలు లేకపోవడంతో ప్లాన్ వేశాడు. అతన్ని ఓ పెద్ద సూట్ కేసులో కుక్కి, దాన్ని అతి కష్టం మీద అపార్ట్ మెంట్ పరిధిలోకి లాక్కుంటూ వచ్చాడు. అంత పెద్ద సూట్ కేసు, పైగా లాక్కురావడానికి ఆపసోపాలు పడుతున్న అతని ప్రవర్తనను చూసిన కొందరికి ఎక్కడో అనుమానం కలిగింది. ఆ సూట్ కేసును తెరచి చూపించాల్సిందేనని పట్టుబట్టి, బలవంతంగా తెరిపించి చూసి, అవాక్కయ్యారు.

ఆ వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి, వారిద్దరినీ స్టేషన్ కు తరలించారు. వీరిద్దరూ కలిసి చదువుకుంటున్నారని గుర్తించి, వారి తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి, స్టేషన్ కు పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి పంపామని, ఈ విషయంలో ఎటువంటి కేసూ రిజిస్టర్ చేయలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Boy Friend
Karnataka
Suit Case

More Telugu News