London: బ్రిటన్, జర్మనీలకు భారత కూరగాయలు, పండ్లు... విమానాల్లో సరఫరా!

Air India to Carry Fruits and Vegetables to Britain and Germany
  • అటు ఎగుమతి, ఇటు రైతులకు ఊరట
  • కృషి ఉడాన్ స్కీమ్ లో భాగంగా విమానాలు
  • రిటర్న్ లో వైద్య పరికరాలు తేనున్న విమానాలు
కరోనా వైరస్ కాటుకు గురై, తీవ్ర ఇబ్బందులు పడుతున్న బ్రిటన్, జర్మనీ దేశాలకు మరోసారి భారత్ ఆపన్నహస్తం అందించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో లాక్ డౌన్ అమలు కారణంగా, తమ ఉత్పత్తులను సరైన ధరకు విక్రయించుకోలేక పోతున్న భారత రైతన్నలకూ వెన్నుదన్నుగా నిలవాలన్న ఉద్దేశంతో విదేశాలకు భారత పండ్లు, కూరగాయలను ఎగుమతి చేయనుంది. ఎయిర్ ఇండియా విమానాల్లో లండన్, ఫ్రాంక్ ఫర్ట్ లకు రెండు విమానాలు సీజనల్ పండ్లు, కూరగాయలను రవాణా చేయనున్నాయి.

"సోమవారం నాడు లండన్ కు, బుధవారం నాడు ఫ్రాంక్ ఫర్ట్ కు ఎయిర్ ఇండియా విమానాలు బయలుదేరుతాయి, కృషి ఉడాన్ స్కీమ్ కింద ఈ విమానాలు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో ఈ విమానాలు అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం అవసరమయ్యే పరికరాలను బ్రిటన్, జర్మనీల నుంచి తీసుకుని వస్తాయి" అని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

కాగా, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విదేశాల్లో మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటును మరింత సులువుగా కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కృషి ఉడాన్ స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీములో భాగంగా అటు ఎగుమతిదారులు, ఇటు దిగుమతిదారులకు అవకాశాలు లభిస్తాయి. తద్వారా రైతులకూ మేలు కలుగుతుంది.
London
Frankfurt
India
Air India
Flights
Cargo
Krushi Udan

More Telugu News