Asaduddin Owaisi: లాక్‌డౌన్‌ ను ఎత్తి వేయకపోతే.. వెంటనే పేదల ఖాతాల్లో రూ.5,000 వేయాలి!: అసదుద్దీన్‌ ఒవైసీ సూచన

  •  మోదీ నాకు కూడా ప్రధానమంత్రే
  • పేదలు పడుతున్న ఇబ్బందుల పట్ల దృష్టిపెట్టాలని నేను కోరుతున్నాను 
  • ముస్లింలు సామాజిక దూరం పాటించాలి
Poor must get Rs 5000 deposited in their accounts if lockdown extended Owaisi

కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ వైరస్‌ను కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వాలకు పలు సూచనలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తి వేయకపోతే పేదల ఖాతాల్లో రూ.5,000 వేయాలి' అని చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్న కరోనా జిహాద్‌పై ఒవైసీ మాట్లాడుతూ... 'ఇటువంటి పనులకు పాల్పడుతున్న వారు దేశాన్ని బలపర్చట్లేదు. జనవరి 1 నుంచి మార్చి 15 వరకు దేశానికి 15 లక్షల మంది విదేశాల నుంచి వచ్చారు. కానీ, తబ్గిగీ జమాత్‌ను మాత్రమే ఎత్తి చూపెడుతున్నారు. దేశంలో మార్చి 3 నుంచి స్క్రీనింగ్‌ ప్రారంభించారు. దీనికి బాధ్యత ఎవరిది?' అని ప్రశ్నించారు.

'ఇతర రాష్ట్రాలకు వలసలు వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా సోకి ఉండొచ్చని, వారు గ్రామాలకు వెళితే అక్కడా విస్తరిస్తుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానిలో నిజంలేదు. ఆరు లక్షల మందిని శిబిరాల్లో ఉంచామని కేంద్ర ప్రభుత్వం అంటోంది. మరి అక్కడ సామాజిక దూరం ఎలా పాటిస్తారు? ఇది ద్వేషాన్ని పెంచేందుకు చేస్తోన్న కుట్ర' అన్నారు.

'మోదీ నాకు కూడా ప్రధానమంత్రే.. పేదలు పడుతున్న ఇబ్బందుల పట్ల దృష్టిపెట్టాలని నేను కోరుతున్నాను. వలసలు వచ్చిన వారు మన సోదరులు.. రాష్ట్రంలో ఎవ్వరూ ఆకలితో ఉండడానికి వీల్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను' అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ముస్లింలు సామాజిక దూరం పాటించాలని, మసీదుల వద్ద గుమికూడకూడదని, ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఆయన సూచించారు. వైద్యులపై రాళ్లు రువ్వడం సరికాదని, వారు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని చెప్పారు.

More Telugu News