Karnataka: పుట్టినరోజు పేరిట ఎంతో మంది జీవితాలను రిస్క్ లోకి నెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!

  • అట్టహాసంగా జయరాం పుట్టిన రోజు వేడుకలు
  • కిక్కిరిసిన చిన్నారులు, అభిమానుల మధ్య కేక్ కటింగ్
  • లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని విమర్శలు
Karnataka MLA Lavish Party in Lockdown

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్న వేళ, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమికూడవద్దని, విందులు, వినోదాలు, వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతుంటే, ప్రజా ప్రతినిధులే దాన్ని పెడచెవిన పెడుతున్నారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే అట్టహాసంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ఎంతో మంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు. 


తుముకూరు జిల్లా తురువెకేరి ఎమ్మెల్యేగా ఉన్న ఎం జయరాం,తన పుట్టిన రోజు పార్టీని బ్రహ్మాండంగా జరుపుకున్నారు. చుట్టూ చేరిన చిన్నారులు, బంధువులు, మిత్రులు, అనుచరగణం మధ్య ఓ భారీ కేక్ ను ఆయన కట్ చేశారు. వీరంతా సామాజిక దూరాన్ని పాటించలేదు సరికదా... కిక్కిరిసి పోయి నిలబడివున్నారు. బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలోని గుబ్బి పట్టణంలో ఈ పార్టీ జరుగగా, వచ్చిన వారందరికీ బిర్యానీ పార్టీ ఇచ్చారు ఎమ్మెల్యే.


ఇక, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, నిబంధనలు పాటించని జయరాంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ ను పాటించకుండా పార్టీలు చేసుకున్న ప్రజా ప్రతినిధుల్లో జయరాం మొదటి వ్యక్తేమీ కాదు. గత నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఓ పెళ్లికి హాజరై విమర్శలు కొని తెచ్చుకోగా, ఆ మరుసటి రోజే, కాంగ్రెస్ వర్కర్లు, డీకే శివకుమార్ ఇచ్చిన పార్టీకి పెద్దఎత్తున హాజరయ్యారు. 


ప్రస్తుతం కర్ణాటకలో 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ ఆరుగురు మరణించగా, 34 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో చిన్నారులు ఉండటం వైద్యాధికారులను ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఇక లాక్ డౌన్ కొనసాగింపుపై, ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత యడియూరప్ప తుది నిర్ణయం తీసుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

More Telugu News