China: చైనాపై అమెరికా ప్రతీకార చర్యలు మొదలు!

  • కరోనాపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్న యూఎస్
  • చైనా టెలికం అనుమతులు రద్దు చేయాలని సిఫార్సులు
  • నేడో, రేపో నిర్ణయం తీసుకోనున్న వైట్ హౌస్
USA Wants to Block China Telecom

కరోనా వైరస్, అది చూపించే ప్రభావం, ఆపై ఏర్పడే నష్టం గురించి ప్రపంచ దేశాలకు చైనా ముందుగానే సమాచారం ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్న అమెరికా, ప్రతీకార చర్యలను ప్రారంభించింది. దేశ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ, యూఎస్ లో సేవలందిస్తున్న చైనా టెలికం సంస్థపై నిషేధానికి రెడీ అయింది. 'చైనా టెలికం'పై ఆంక్షలు విధించాలని, దానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎఫ్సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్)కు యూఎస్ డిఫెన్స్, హోమ్, వాణిజ్య శాఖలు ఒకేసారి సిఫార్సు చేశాయి. 


న్యాయ శాఖ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ, "చైనా టెలికం కంపెనీతో అమెరికాకు నష్టం కలుగుతుందని గుర్తించాం. ఆ సంస్థ లైసెన్స్ లను రద్దు చేయాలి" అని కోరింది. ఇక ఈ మేరకు అమెరికా నిర్ణయం తీసుకుంటే, లక్షల మందికి మొబైల్, ఇంటర్నెట్ సేవలు దూరమవుతాయి. 


కాగా, గతంలోనూ చైనా టెలికం సంస్థపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ సైబర్ నిఘాను పెట్టిందని, ఆర్థిక గూడచర్యానికి పాల్పడుతూ, దేశాభివృద్ధికి అంతరాయం కలిగిస్తోందని పలు మంత్రిత్వ శాఖలు ఆరోపిస్తున్నాయి. చైనా టెలికం సంస్థ, యూఎస్ కమ్యూనికేషన్స్ సిస్టమ్ ను దారి మళ్లిస్తోందని పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మండిపడుతున్నాయి. ఇక, ఈ విషయంలో శ్వేతసౌధం నేడో, రేపో కల్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. 

More Telugu News