Hyderabad: హైదరాబాద్ యువకుడిపై ప్రియాంకా గాంధీ ప్రశంసలు!

  • లక్నోకు ప్రయాణించిన రామకృష్ణ
  • కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలో సేవలు
  • ఇటువంటి వారిని గౌరవిద్దామన్న ప్రియాంకా గాంధీ
Priyanka Gandhi Praises Hyderabad Youth

కరోనా లక్షణాలున్న వారి రక్త నమూనాల పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నుంచి 1,500 కిలోమీటర్లు ప్రయాణించి లక్నో చేరుకున్న ఓ యువకుడిని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రశంసించారు. రామకృష్ణ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి బయలుదేరి, లక్నో చేరుకుని కరోనాపై పోరాటానికి సహకరిస్తున్నారని, ఇటువంటి లక్షలాది మంది నిజమైన సైనికులను గౌరవించి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు.

మైక్రో బయాలజీలో పరిశోధన చేస్తున్న రామకృష్ణ, ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలో రక్త నమూనాల పరీక్షలు చేస్తున్నారు. అతని గురించి తెలుసుకున్న ప్రియాంక, "ఇదే మన ఇండియా. ఇటువంటి సైనికులు ఇండియాలో లక్షల మంది ఉన్నారు. వారందరినీ గౌరవిద్దాం. వారి సేవాతత్పరతను ప్రోత్సహిద్దాం" అని వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామకృష్ణ, లాక్ డౌన్ కు ముందే హైదరాబాద్ చేరుకుని, విమానంలో లక్నోకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వార్త మీడియాలో రావడంతో ప్రియాంకా గాంధీ స్పందించి, రామకృష్ణను ప్రశంసించారు.

More Telugu News