Saudi Arabia: సౌదీలో కలకలం.. రాజకుటుంబంలో 150 మందికి కరోనా!

  • యూరప్ పర్యటనలో వైరస్ సోకి ఉంటుందని అనుమానం
  • ఐసీయూలో సీనియర్ యువరాజైన రియాద్ గవర్నర్   
  • వైరస్ బారినపడిన వారిలో పలువురి పరిస్థితి విషమం?
Saudi Royal Family now fighting with Corona virus

సౌదీ రాజకుటుంబానికి చెందిన 150 మంది కరోనా వైరస్ బారినపడినట్టు పలు అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు రావడం కలకలం రేపుతోంది. రియాద్ గవర్నర్ అయిన సీనియర్ యువరాజు ఫైసల్ బిన్ బండార్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ (70) కరోనా బారినపడి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

రాజకుటుంబంలో మరో 12 మందికిపైగా చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు మరెంతో మంది వైరస్‌తో పోరాడుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆ కథనం సారాంశం. రాజ కుటుంబానికి చికిత్స చేసే కింగ్ ఫైసల్ ఆసుపత్రిలో 500 పడకలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందాయని, ఇది బయటకు రావడంతోనే వారు కరోనా బారినపడిన విషయం బయటకు వచ్చిందని పలు పత్రికలు పేర్కొన్నాయి.

ఎన్ని కేసులు అనే విషయం తెలియదని, కాకపోతే హై అలెర్ట్‌గా ఉండాలన్నది మెసేజ్ సారాశంగా పేర్కొంది. వేలాది మందిగా వున్న సౌదీ రాజులలో చాలామంది క్రమం తప్పకుండా యూరప్ పర్యటనలకు వెళ్తుంటారని, ఈ క్రమంలోనే వారికి కరోనా వైరస్ సంక్రమించి ఉంటుందని, వారి ద్వారా దేశంలోకి ప్రవేశించి రాజకుటుంబం మొత్తానికి సోకి ఉంటుందని భావిస్తున్నారు. 33 మిలియన్ల మంది ప్రజలు నివసించే సౌదీలో ఇప్పటి వరకు 2,932 కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు.

More Telugu News