Women safety: మహిళల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

  • తన శాఖాపరమైన విభాగాల బాధ్యులతో వీడియో కాన్ఫరెన్స్ 
  • మహిళా సంఘాల నుంచి వస్తున్న ఫిర్యాదుల ప్రస్తావన 
  • అన్ని సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు
Centre always active for womens safety

మహిళలు స్వీయభద్రత విషయంలో ఆందోళనలో ఉన్నారని, వారి రక్షణకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్న మహిళా సంఘాల డిమాండ్‌పై కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెంటనే స్పందించారు. మహిళల్లో మనోధైర్యం కల్పించి వారు ధైర్యంగా సమాజంలో తిరగగలిగే పరిస్థితులు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తన శాఖాపరమైన అన్ని విభాగాల ఇన్ చార్జిలతో నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మహిళల భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం, అనుబంధ శాఖలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని, ఈ విషయంలో మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గృహహింస కేసులు రెట్టింపు అయ్యాయని, మహిళల మానసిక, సామాజిక భద్రత విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఆమె ప్రస్తావించారు.

వన్‌స్టాప్‌ సెంటర్లు మరింత చురుకుగా వ్యవహరించాలని, మహిళలపై జరిగే అకృత్యాలపై తక్షణం స్పందించాలని ఆదేశించారు. మహిళలు ఎదుర్కొంటున్న ఒకే విధమైన సమస్యలపై స్పందించేందుకు దేశవ్యాప్తంగా కౌన్సెలర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కాలంలోనూ డిజిటల్ గవర్నెన్స్ ద్వారా మహిళల భద్రత విషయంలో పూర్తి అప్రమత్తంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలకు మంత్రి ఓ విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త రోజూ కనీసం పది మంది మహిళలను ఫోన్ ద్వారా చైతన్య పరచాలన్నారు. 'మనం కూడా సమాజంలో భాగమే, ఒంటరివాళ్లం కాము, మనకోసం పనిచేసే విభాగాలు ఎన్నో ఉన్నాయి' అని వారికి తెలియజేయాలని సూచించారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వన్‌స్టాప్‌ కేంద్రాల సిబ్బంది, స్వధార్ గృహ, ఉజ్వల హెూమ్స్ ప్రతినిధులు, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ప్రతినిధులు దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు.

More Telugu News