Hyderabad: ఆ 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించిన జీహెచ్ఎంసీ

  • ఉత్తర్వులు జారీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్
  • నగరంలోని మొత్తం బాధితుల్లో 89 మంది ఆయా ప్రాంతాల వారే
  • ఆ ప్రాంతాలను అధీనంలోకి తీసుకోనున్న అధికారులు
GHMC announces 12 containment clusters in Hyderabad

ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కువగా ఉన్న 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించింది. ఇందులో  రాంగోపాల్‌పేట, రెడ్‌హిల్స్, మూసాపేట, గాజులరామారం, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, చందానగర్ సహా పలు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే, రంగారెడ్డి, మేడ్చల్  జిల్లాల్లోనూ  మూడు ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో మొత్తం 175 కరోనా కేసులు నమోదు కాగా, వీటిలో 89 మంది ఆయా ప్రాంతాల వారే కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌కు కానీ, ఐసోలేషన్‌కు కానీ తరలిస్తారు. వీధులను శుభ్రం చేసి క్రిమి సంహారక ద్రావణాలతో పిచికారీ చేస్తారు. అంతేకాదు, ఆ ప్రాంతాల్లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

More Telugu News