మందుబాబులకు ఊరట.. డోర్ డెలివరీకి సిద్ధమవుతున్న మమత ప్రభుత్వం

08-04-2020 Wed 21:02
  • ఆన్‌లైన్ ద్వారా మద్యం అమ్మకాలు
  • ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య ఫోన్ ద్వారా ఆర్డర్ వెసులుబాటు
  • డెలివరీలో ఇబ్బందులు లేకుండా పోలీసు పాసులు
West Bengal Govt ready to liquor door delivery

మందుబాబులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ వేళ మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. మందు దొరక్క కొందరు వింతగా ప్రవర్తిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యాన్ని నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేయాలని సీఎం మమత బెనర్జీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన మద్యం దుకాణాలను తెరవకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి షాపు ద్వారా డెలివరీ చేయనున్నారు.

ఇందుకోసం హోం డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్ స్టేషన్ల నుంచి పాస్‌లు జారీ చేయనున్నారు. ఒక్కో షాపునకు మూడు డెలివరీ పాస్‌లు అందజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫోన్ల ద్వారా మద్యాన్ని ఆర్డర్ చేసుకుంటే సాయంత్రం ఐదు గంటలలోపు మద్యాన్ని డెలివరీ చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది.