నేను ఖాళీగా వున్నానని ప్రచారం చేసేవారే ఖాళీగా వున్నారు: తమన్నా ఫైర్

08-04-2020 Wed 13:07
  • నేను బిజీగానే వున్నాను 
  • వరుస ప్రాజెక్టులు వస్తూనే వున్నాయి 
  • 365 రోజులు నేను బిజీగానే వున్నాను 
Thamannah

తెలుగు .. తమిళ భాషల్లో తమన్నా అందాల కథానాయిక అనిపించుకుంది. నాజూకుదనానికి నమూనా అంటూ ప్రశంసలు అందుకుంది. అయితే కొత్త కథానాయికల ఎంట్రీ వలన ఇటీవల కాలంలో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. పెరిగిన ఆమె పారితోషికం మరో కారణమని అనేవారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తమన్నా పనైపోయిందనీ, ఎటు వైపు నుంచి చూసినా ఆమెకు పెద్దగా అవకాశాలు లేవనే వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, తను ఖాళీగానే వున్నానంటూ జరుగుతున్న ఈ ప్రచారం పట్ల తమన్నా స్పందిస్తూ .. "365 రోజులు నేను బిజీగానే వున్నాను .. వరుసగా ప్రాజెక్టులు వస్తూనే వున్నాయి. నాకు నచ్చిన పాత్రలను నేను ఎంచుకుంటూనే వున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న 'సీటీమార్' షూటింగు దశలో వుంది. ఈ సినిమాలోని పాత్ర కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నా ప్లానింగ్ ప్రకారం నేను ముందుకు వెళుతున్నాను. నేను ఖాళీగా వున్నానని ప్రచారం చేసేవారే ఖాళీగా వున్నారని నాకు అర్థమవుతోంది" అని చెప్పుకొచ్చింది.