రాజకీయాలు చేయడానికి ఇంత కంటే అనువైన సమయం దొరకలేదా మీకు?: విపక్షాలపై విజయసాయిరెడ్డి ఆగ్రహం

08-04-2020 Wed 12:39
  • ఉపాధి కోల్పోయిన పేదలకు సాయం చేస్తున్నాం
  • ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఎలా పంపిణీ చేస్తుందంటున్నారు
  • వీళ్ల యజమానేమో ఐదు వేలివ్వమని రంకెలేస్తుంటాడు
vijaya sai reddy fires on chandra babu naidu and kanna

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, సీపీఐ నేత రామకృష్ణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో పేదలకు ఆర్థిక సాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.

రేషన్‌ కార్డు దారులకు  రూ.1000 నగదు అందిస్తున్నారు. అయితే, కన్నా లక్ష్మీనారాయణ దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాసి, ఆ ఆర్థిక సాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.

వీటిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు. 'ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఎలా పంపిణీ చేస్తుందని కన్నా, సీపీఐ రామకృష్ణలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వీళ్ల యజమానేమో ఐదు వేలివ్వమని రంకెలేస్తుంటాడు. రాజకీయాలు చేయడానికి ఇంత కంటే అనువైన సమయం దొరకలేదా మీకు?' అని ఆయన విమర్శించారు. కాగా, లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.