ఆన్ లైన్ లోనే అర్చన... ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ సర్కారు!

08-04-2020 Wed 06:39
  • నేటి నుంచి ఉజ్జయిని మహంకాళి, కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయాల్లో మొదలు
  • టీఎస్ యాప్ ఫోలియో అందుబాటులోకి
  • భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు ఇంటికే
Online Archan Amid Lockdown in Telangana

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ, దేవాలయాలన్నీ భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో భక్తులు మానసిక వేదనకు గురవుతుండగా, భక్తులకు ఆలయ ప్రవేశం లేకున్నా, వారి పేరిట పూజలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచింది.

తొలి దశలో సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి ఆలయంలో పూజలు ప్రయోగాత్మకంగా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో పాల్గొనే వారు ముందుగా ప్లే స్టోర్ నుంచి 'టీఎస్ యాప్ ఫోలియో'ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో ఆలయాల వివరాలు చూసి, అందులో కావాల్సిన ఆర్జిత సేవను ఓపెన్ చేసి, వివరాలు నమోదు చేసుకుంటే చాలు. భక్తులు కోరిన రోజున ఆ పూజలు నిర్వహిస్తారు. పూజల తరువాత అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్ తో కూడిన ప్రసాదాన్ని అందించాలని తొలుత భావించినా, తపాలా, కొరియర్‌ సేవలు పరిమితంగా ఉన్నందున ప్రస్తుతం ఇది సాధ్యం కాదని అధికారులు అంచనాకు వచ్చారు.

ఇక భక్తులు భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని తిలకించలేకపోయినా, కల్యాణ తలంబ్రాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఇందుకు గాను రూ. 30 పోస్టల్ చార్జి, తలంబ్రాల కోసం రూ. 20, సర్వీస్ చార్జ్ లను చెల్లించాల్సి వుంటుంది. తపాలా శాఖ ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేరుస్తుంది.