India: హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై వెనక్కి తగ్గిన భారత్‌.. కీలక నిర్ణయం!

  • పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్‌ అందజేస్తాం
  • ఔషధాల పంపిణీపై వస్తోన్న కొన్ని ఊహాగానాలకు చెక్‌ పెడదాం
  • మన సామర్థ్యంపై ఆధారపడిన పొరుగుదేశాలకు కూడా పంపిణీ చేస్తాం 
We will also be supplying these essential drugs to some nations inida

మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్స్‌కు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో పలు దేశాలు భారత్‌ వైపు చూస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఈ ఔషధం విరివిగా తయారవడమే ఇందుకు కారణం. అయితే, భారత్‌లోనూ కరోనా కేసులు పెరగడంతో వీటి ఎగుమతులపై నిషేధం విధించిన భారత్‌ ఈ నిర్ణయంపై తాజాగా వెనక్కి తగ్గింది. ఈ విషయంలో తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.

'కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్‌ అందజేస్తాం. ఔషధాల పంపిణీపై వస్తోన్న కొన్ని ఊహాగానాలకు, ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న ప్రయత్నాలకు చెక్‌ పెడతాం' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

'కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో పారాసిటిమల్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు మొత్తం 14 రకాల ఔషధాలను తగిన మోతాదులో మన పొరుగుదేశాలకు కూడా అందిస్తుంది. మన సామర్థ్యంపై ఆధారపడిన పొరుగుదేశాలకు, అత్యధికంగా ఈ  మహమ్మారి బారిన పడిన  దేశాలకు కూడా మేము ఈ  మందులను సరఫరా చేస్తాం" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. భారత్‌ ఎల్లప్పుడూ ఇతర దేశాలకు సహకారం అందించాలన్న దృక్పథంతోనే ఉంటుందని తెలిపారు. కొన్ని ఔషధాల విషయంలో మత్రమే ఈ తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను అమెరికాకు భారత్ ఎగుమతి చేయకపోతే బదులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే భారత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  

More Telugu News