తనయుడి పెళ్లి ఘనంగా చేయాలనుకున్న కుమారస్వామి.. అంతా తలకిందులైంది!

07-04-2020 Tue 10:40
  • ఈ నెల  17న కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహం
  • కరోనా ప్రభావంతో ఇంట్లోనే వివాహ వేడుకను నిర్వహించాలని నిర్ణయం
  • పెళ్లికి 20 మంది వరకు బంధువులు హాజరవుతారన్న కుమారస్వామి
Kumaraswamy son Nikhils marriage will be a low key affair

ఈనెల 17న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహం జరగనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.కృష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ వివాహం జరగబోతోంది. ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని కుమారస్వామి భావించారు. రామనగరలోని జనపద లోక సమీపంలో 95 ఎకరాల విస్తీర్ణంలో ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, జేడీఎస్ నేతలు, కార్యకర్తలందరూ ఈ  వివాహానికి హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మొత్తం తలకిందులైంది. వివాహాన్ని సింపుల్ గా చేసేయాలని కుమారస్వామి నిర్ణయించారు.

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ముందు అనుకున్న విధంగా వివాహాన్ని నిర్వహించలేమని చెప్పారు. ఇంట్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించామని... ఈ వేడుకకు 15 నుంచి 20 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలిపారు. 17వ తేదీ శుభ దినమని...  అందుకే పెళ్లిని వాయిదా వేయడం లేదని చెప్పారు. ఒక వేళ రానున్న రోజుల్లో పరిస్థితుల్లో మార్పు వస్తే... అప్పుడు మళ్లీ ఆలోచిద్దామని అన్నారు.

మరోవైపు, గత సార్వత్రిక ఎన్నికల్లో మండ్య పార్లమెంటు స్థానం నుంచి సినీ నటి సుమలతపై నిఖిల్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నిఖిల్ సినీ నటుడు కూడా. రెండు కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.