కరోనా మహమ్మారి ఎన్నడూ లేనంత బాధను కలిగిస్తున్న వేళ... అమెరికా తీరు ఎలా మారిందంటే..!

07-04-2020 Tue 10:32
  • అమెరికాలో పెరిగిన మాస్క్ ల దొంగతనాలు
  • ఎక్కడా లభించని హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు
  • మాస్క్ లను దొంగిలించే స్థాయికి దిగజారిన యూఎస్ సర్కారు
  • నానాటికీ ట్రంప్ పై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం
  • ట్రంప్ మనసు మారాలంటున్న నిపుణులు
What America Changed form Corona Virus

 ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నిత్యమూ సుదీర్ఘ మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అమెరికాలో 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల నిల్వలు ఉన్నాయని భరోసా ఇచ్చారు. అసలు ఈ ఔషధం కరోనాను పూర్తిగా నియంత్రిస్తుందని ఇంతవరకూ ఎక్కడా నిరూపితం కాలేదు. ఇదే సమయంలో చికిత్సకు మాత్రం ఉపకరిస్తోంది. ట్రంప్ మాట్లాడిన అనంతరం, మీడియా ఈ ఔషధంపై ప్రశ్నిస్తుంటే, వారికి సమాధానం ఇచ్చేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజస్ డైరెక్టర్ డాక్టర్ ఆంధోనీ ఫౌసీకి అనుమతి లభించలేదు.

ఇప్పటికి ఇంకా హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్, కరోనాను ఎదుర్కొంటుందని ఎక్కడా తేలకపోవడమే డాక్టర్ ఫౌసీ సమాధానం ఇవ్వకుండా అడ్డుకున్నందుకు కారణమేమో. ఈ డ్రగ్ ను ఇప్పటికే అమెరికాలో సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పుడు కరోనా రోగులకు కూడా ఇది లభించడం లేదన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ట్రంప్ చెప్పిన విధంగా కరోనా వైరస్ ట్రీట్ మెంట్ కు ఈ డ్రగ్ ను ఎఫ్డీఏ ఇంతవరకూ ఆమోదించలేదు. డొనాల్డ్ ట్రంప్ కు డాక్టర్ ఫౌసీ విధేయుడు కాదు. ఆయన భజనపరుల్లా ప్రతి దానికీ తందాన తాన అనే రకం కాదు. ఇది గతంలోనే వెల్లడైంది. అందుకే, ట్రంప్ ఒకటి మాట్లాడిన తరువాత దానికి భిన్నంగా ఫౌసీ ఎక్కడ మాట్లాడతాడో అన్న అనుమానంతోనే ఆయనని వారించడం జరిగింది.

ఇక, అమెరికాలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు అంతరించిపోవడానికి మరో కారణం, ప్రజలు దీన్ని విరివిగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవడమే. అమెరికా అధ్యక్షుడు సైతం ఈ టాబ్లెట్లను వాడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. ఇప్పుడు అమెరికాలో అవసరం ఉన్నా, లేకున్నా, మలేరియా చికిత్సలో వాడే ఔషధానికి ఎనలేని డిమాండ్ వచ్చి పడింది.

ఇక యూఎస్ ముందున్న మరో సమస్య మాస్క్ లు. ఇవి ఎక్కడ కనిపించినా, అక్కడికి చోరులు వాలిపోతున్నారు. చైనా నుంచి జర్మనీకి వెళుతున్న 2 లక్షల ఎన్-95 మాస్క్ లున్న విమానాన్ని అమెరికాకు మళ్లించారన్న వార్త ఈ నెల 3వ తేదీన కలకలమే రేపింది. బెర్లిన్ పోలీస్ ఫోర్స్ ఈ మాస్క్ లను తమ దేశ అవసరాల కోసం ఆర్డర్ ఇచ్చింది. జర్మనీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. ప్రపంచంలోనే కరోనా సోకిన నాలుగో అతిపెద్ద దేశంగా జర్మనీ నిలిచింది.

అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు, ఆయన వైఖరి అమెరికన్ల మనస్తత్వాన్ని మార్చివేశాయి. దీని కారణంతోనే యూఎస్ లో ఇప్పుడు మాస్క్ లకు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కు కొరత ఏర్పడింది. ఇతరులు వ్యాధితో బాధపడుతూ ఉంటే, తమకు పట్టదన్న సంకేతాలను అమెరికన్లు బయటి ప్రపంచానికి పంపుతున్న పరిస్థితి. తమ ప్రయోజనమే తప్ప, ఇతరుల కష్టాన్ని వారు పట్టించుకోవడం లేదు.

మరో రకంగా చెప్పాలంటే, అమెరికాలో ఇప్పుడు రాష్ట్రాల మధ్య కూడా పోరు సాగుతోంది. న్యూయార్క్ కు వెంటిలేటర్లు చాలినంతగా రాకపోవడానికి కూడా ట్రంపే కారణమని ఈ ప్రాంతంలోని అమెరికన్లు ఆగ్రహంతో ఉన్నారు. చైనా 1000 వెంటిలేటర్లను పంపినా, వాటి అవసరం ఎంతో ఉన్న న్యూయార్క్ కు మాత్రం చేరలేదు. చాలినంతగా వైద్య పరికరాలను పంపిస్తామని ప్రభుత్వం నుంచి న్యూయార్క్ కు భరోసా కూడా లభించక పోవడం గమనార్హం.

మొత్తం మీద కరోనా వైరస్ కారణంగా తెలిసొచ్చిందేమిటంటే, ఈ ప్రపంచంలో సరిహద్దులు, గిరిగీతలు ఏ మాత్రం ఉపయోగపడవు. ఒక దేశానికి కష్టం వస్తే, అది మరో దేశానికి పాకుతుంది. దీంతో ఒకరి మౌలిక వసతులను మరొకరు దొంగిలించాలని చూస్తారు. ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం తదితర రంగాల్లో ఓ ప్రాంతంలో ఏర్పడే కొరత, మిగతా ప్రాంతానికీ విస్తరిస్తుంది. ఇప్పుడు ఆ పాపం ఆ దేశ ప్రజలకు చుట్టుకుంది. దీన్ని అమెరికా అధ్యక్షుడు ఎన్నటికీ అంగీకరించరు. అంగీకరించరు కూడా.

ఒకవేళ, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం అద్భుతంగా పనిచేసి, కరోనాను పారద్రోలుతుందని ఇప్పుడు తేలినా, అమెరికాలో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని వుందనడంలో సందేహం లేదు. ఫ్రాన్స్ కు రావాల్సిన మాస్క్ లను అమెరికా ఎలాగైతే దొంగిలించిందో, అమెరికన్లు తమ తోటి వారికి అవసరమైన ఈ ముఖ్యమైన డ్రగ్ ను దొంగిలిస్తున్నారు. అంటే, ప్రభుత్వానికి, ప్రజలకు తేడా ఏమీ లేదు. దీర్ఘ దృష్టి లేని నేత పరిపాలనలో అంతే కదా?

ఈ పరిస్థితుల్లో కోరుకునేది ఒక్కటే. ట్రంప్ చుట్టూ ఉన్నవారు ఆయన మనసు మార్చాలి. ఈ ప్రపంచంలో అమెరికా తిరుగులేనిదన్న భావన పోవాలి. అమెరికా మాత్రమే స్వయం ప్రతిపత్తిగల దేశమన్న ఆలోచన ఆయన మనసును వీడాలి. నలుగురితో కలిసి వైరస్ పై పోరుకు సిద్ధమైతే, అమెరికా బాగుపడుతుందనడంలో సందేహం లేదు.