రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి మృతి

06-04-2020 Mon 18:09
  • కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీలక్ష్మి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఈ విషయాన్ని తెలియజేసిన శ్రీలక్ష్మి కుటుంబసభ్యులు
Artist Rajeev Kanakala sister Sri lakshmi demise

ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ఇంట విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.  ‘కరోనా’ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల రీత్యా శ్రీలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఎవరూ రావొద్దని ఆమె కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

కాగా,  దివంగత నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కూతురు శ్రీలక్ష్మి. తన తండ్రి దేవదాస్ కనకాల రూపొందించిన రాజశేఖర చరిత్ర సీరియల్ ద్వారా బుల్లి తెరకు ఆమె పరిచయమయ్యారు. పలు తెలుగు సీరియల్స్ లో ఆమె నటించింది. శ్రీలక్ష్మి భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు. శ్రీలక్ష్మి, రామారావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.